దేశమేదైనా… ఉగ్రవాదుల ఉద్దేశం… హింస మాత్రమే!

 

ఉగ్రవాదం… ఇప్పుడు ఇది హింసకు మారు పేరు అయిపోయింది! కొందరు జిహాదన్నా, మరికొందరు ఇస్లామిక్ టెర్రరిజమన్నా, ఇంకొందరు ఐసిస్సన్నా, ఆల్ ఖైదా అనన్నా… మన దేశంలో కాశ్మీరీ వేర్పాటు వాదమన్నా… అంతటా సారాంశం మాత్రం ఒక్కటే… విచ్చలవిడి హింస! మానవ చరిత్రలోనే గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఇలాంటి అర్థం పర్థం లేని హింస చెలరేగలేదు! ఆత్మహుతి దాడి చేసే ఉగ్రవాది ఏం ఆశిస్తున్నట్టు? తానే చనిపోయాక వచ్చేది ఏంటి? పోయేది ఏంటి? అయినా మూర్ఖంగా వేలాది మంది టెర్రరిస్టులు లక్షలాది మంది అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటారు..

 

కొంత కాలం క్రితం వరకూ భారత్, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల టార్గెట్ గా వుండేవి. ఎందుకంటే, ఇక్కడ మెజార్జీ ప్రజలు ముస్లిమేతరులు కాబట్టి. కాని, రాను రాను ప్రపంచ పటంలో ఏ ఒక్క దేశమూ ఉగ్రవాదానికి అతీతంగా వుండలేకపోతోంది! తాజాగా ఇరాన్ ఏకంగా పార్లమెంట్ నే ఉగ్రవాదుల దెబ్బకి మూసేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి అనుభవం మనకైతే కొత్త కాదు. మన పార్లమెంట్ పై ఎప్పుడో ఉగ్రవాదులు దాడి చేశారు!

 

భారత్ మీద ఇస్లామిక్ జిహాదీలకు మతం వేరనే ద్వేషం వుండవచ్చు. కాని, ఇరాన్ అధికారికంగా ముస్లిమ్ దేశం. అయినా దాని మీద కూడా ముస్లిమ్ ఉగ్రవాదులే అయినా ఐఎస్ జిహాదీలు ఎందుకు తెగబడ్డారు? షియా, సున్నీ తేడాల కారణంగా! ఇరాన్ లో వుండేది మెజార్టీ షియాలు! సున్నీలు మాత్రమే భూమిపై వుండాలనే సిద్దాంతంతో నడిచే ఐసిస్ కు సహజంగానే ఇరాన్ శత్రువు! అందుకే, దాడి!

 

సున్నీలు షియాలపై దాడులు చేయటమే కాదు… షియాలు కూడా సున్నీలపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు వున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరానే ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపిస్తోంది! కాని,మరోవైపు ఐఎస్ఐఎస్ లాంటివి పుట్టటానికి అమెరికానే కారణం అనేవారు కూడా లేకపోలేదు! అమెరికా, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాలు కలిసి లోపాయికారిగా ఉగ్రవాదుల్ని పోషిస్తున్నాయి. ఐసిస్ ఆధీనంలో వున్న ప్రాంతాల్లోని చమురుని దాదాపు అన్ని ప్రధాన దేశాలు అక్రమంగా కొనుగోలు చేశాయని చెబుతారు. ఆ విధంగా ఉగ్రవాదులకి డాలర్లు అప్పజెబుతూ మళ్లీ వారి మీద క్షిపణి దాడులు చేస్తున్నాయి అమెరికా లాంటి దేశాలు! ఉగ్రవాదం ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న సౌదీ అరేబియా ఖతార్ ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి వెలివేసింది! ఇలాంటి రాజకీయాలే అమాయకుల రక్తం చిందటానికి కారణం అవుతున్నాయి.

 

ఇంతకాలం తమ వ్యాపార లాభాల కోసం ఏదో ఒక విదంగా ఉగ్రవాదాన్ని రాజేసి వదిలిన దేశాలకు ఇప్పుడు ఉగ్రవాదం సెగ నేరుగా తగులుతోంది. ఇరాన్ నుంచి బ్రిటన్ దాకా అన్ని దేశాలు టెర్రరిస్ట్  సంస్థల పేర్లు తలుచుకుని గడగడ వణుకుతున్నాయి. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదుల కర్మగారం కూడా పదే పదే ఉగ్ర దాడులకి అల్లాడిపోతోంది. పాక్ లో రక్తం మరిగిన ఉగ్రవాదులు అక్కడే దాడులు చేస్తున్నారు! మొత్తం మీద టెర్రరిస్టులు ఎవరి మీద, ఎందుకు, ఎలా చేస్తున్నారో అర్తం కాకుండా యుద్ధం చేస్తున్నారు! ఏ దేశమూ సేఫ్ కాకుండా పోయింది. ఎందుకంటే, ఒక దేశం ఉగ్రవాదులు మరో దేశంపై దాడి చేస్తే ఇంకో దేశం ఉన్మాదులు మరింకో దేశంపై తెగబడుతున్నారు! దీనికి అంతం లేకుండా పోతోంది!

 

దాడి ముస్లిమ్ దేశమైన ఇరాన్ లో జరిగినా, పాక్ లో జరిగినా, యూదు దేశమైన ఇజ్రాయిల్ లో జరిగినా, మన భారతదేశంలో చోటు చేసుకున్నా… పోయేది అమూల్యమైన మానవ ప్రాణమే! కాబట్టి ప్రపంచ దేశాలు చిత్త శుద్ది వుంటే… ఉగ్రవాదాన్ని వ్యాపారంగా చూడటం మానేసి స్వంత లాభాలు పక్కన పెట్టాలి. ఉగ్రవాదానికి మతం ఎంత వరకూ దోహదపడుతుందో చూసుకుని మతాన్ని సంస్కరించుకోవాలి. అప్పుడే అన్ని దేశాలు ఉగ్ర భూతం నుంచి క్షేమంగా వుంటాయి. లేదంటే, ఉగ్రవాదులు ఏదో ఒక రోజు చేసే అణు దాడిలో ఇప్పుడు చెలగాటం ఆడుతోన్న అన్ని దేశాలు పాపానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది!