ఐఎస్ఎస్‌ ఇంకా బతికే ఉంది..!

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా..సింపిల్‌గా చెప్పాలంటే ఐఎస్ఐఎస్..ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా పవిత్ర యుద్ధం పేరుతో హింసకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తూ..రక్తపుటేరులు పారిస్తోంది ఐసిస్. తన లక్ష్య సాధనలో భాగంగా ఇరాక్, సిరియాలను ఆక్రమించి ప్రపంచ శాంతికి పక్కలో బల్లెంలా మారింది. అతివాద భావ జాలంతో ప్రజాస్వామ్యంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకొని ఇరాక్, సిరియా ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా తమ వైపు తిప్పుకున్నారు ఐఎస్ ఉగ్రవాదులు.

 

తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఈ ఉగ్రవాద సంస్థకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశాయి. పాముకు పాలు పోసి పెంచినా..అది చివరకు విషాన్నే కక్కుతుంది అన్నట్లు ఈ ఉగ్రభూతం చివరకు ఆయా ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. ఆసియా, ఐరోపా, అమెరికా ఖండాల్లోని అనేక దేశాలు దీని ధాటికి వణికిపోతున్నాయి. పరిస్థితి చేయి దాటకుండా..ప్రపంచశాంతిని పరిరక్షించేందుకు అమెరికా సారథ్యంలోని సంకీర్ణసేనలు ఐసిస్‌పై యుద్ధం ప్రకటించాయి. దీనిలో భాగంగా ఇరాక్, సిరియాల్లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంస్థ ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేసే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.

 

ఈ దాడుల క్రమంలో ఇస్లామిక్ స్టేట్ వెనుకంజ వేయాల్సి వచ్చింది. సుమారు ఒకటి, రెండు నెలల పాటు ప్రపంచంలోని ఏ మూల కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగకపోవడంతో ఐఎస్ఐఎస్ చరిత్ర ఇక ముగిసిందని అంతా భావించారు. కానీ రెండు రోజుల క్రితం ఇరాక్‌లోని ఓ రెస్టారెంట్‌పై విరుచుకుపడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 74 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే బ్రిటన్ రాజధాని లండన్‌‌ భూగర్భ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడుకి పాల్పడింది ఐసిస్. సిరియా, ఇరాక్‌లలో నిత్యం వైమానిక దాడులకు దిగుతూ ఐఎస్ఐఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోన్న పశ్చిమదేశాల్లో వణుకు పుట్టించడం ద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.