ప్రజా బాణమా? బీజేపీ బాణమా?

పోలా. అదిరిపోలా. ఖమ్మంలో షర్మిల స్పీచ్ అదిరిపోలా. 40 నిమిషాల అద్భుత ప్రసంగం. ఏ పెద్ద స్థాయి నేతకూ తీసిపోని వాక్ ప్రవాహం. తాను అల్లాటప్పాగా పార్టీ పెట్టలేదని.. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదంటూ సభ వేదికగా సింహగర్జన చేశారు షర్మిల. 

సింహం సింగిల్‌గానే వస్తుంది. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్‌ పంపిస్తేనో రాలేదన్నారు. తాను రాజన్న బిడ్డనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు షర్మిల.

చెప్పడమైతే తాను సింగిల్‌గానే వస్తున్నానంటూ చెబుతున్నారు కానీ, ఖమ్మం ప్రసంగాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే.. అలా అనిపించడం లేదంటూ విశ్లేషిస్తున్నారు. 40 నిమిషాల స్పీచ్‌లో 38 నిమిషాలు కేసీఆర్ సర్కారును కుమ్మేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో నిమిషం మాత్రమే కేటాయించారు. అంటే, కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని ఆమె ఉద్దేశ్యమా? పెట్రోల్ ధరలు పెరగడం కనిపించడం లేదా? గ్యాస్ రేట్లు మంట పుట్టించడం లేదా? రాష్ట్ర విభజన హామీల అమలు కోసం తెలంగాణ అలమటించడం లేదా? ఐటీఐఆర్ రద్దు చేసింది కేంద్రం కాదా? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా కేంద్రం తెలంగాణకు ఎంతో ద్రోహం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క సమస్యపైనా షర్మిల విమర్శల బాణం ఎక్కుపెట్టకపోవడం వ్యూహాత్మకమా? ఉద్దేశ్యపూర్వకమా? అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

షర్మిల బీజేపీని విమర్శించేందుకు ఒకే ఒక్క నిమిషం కేటాయించడం స్ట్రాటజీనే అంటున్నారు. "రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? బీజేపీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏదీ చూపడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు." ఇంతే ఈ మూడు ముచ్చట్లే. పైపైన చేసిన ఈ చిన్నపాటి విమర్శలే. ఇంకేమీ అనలేదు. బీజేపీని గట్టిగా నిలదీయలేదు. పువ్వుతో కొట్టినట్టు బీజేపీపై సుతిమెత్తని విమర్శలకే పరిమితమయ్యారని అంటున్నారు. 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తూ.. బీజేపీ వేగంగా దూసుకొస్తోంది. అందులోనూ బీజేపీ జాతీయ పార్టీ కూడా. కమలనాథులకు బలం, బలగం మెండు. కొండనైనా ఢీకొట్టగల సత్తా వారిది. అలాంటిది.. తెలంగాణలో కొత్త పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్న షర్మిలకు.. కేసీఆర్‌తో పాటూ కమలం పార్టీ కూడా ప్రధాన శత్రువే. కేవలం గులాబీ బాస్‌పైనే విమర్శలకు ఎక్కుపెడితే.. మరి, బీజేపీకి ఎలా చెక్ పెడతారు? ఇంత చిన్న విషయం తెలీకుండానే షర్మిల పార్టీ పెట్టబోతున్నారా? లేక, కావాలనే ఆమె బీజేపీని నిలదీయలేదా? అనే అనుమానాలు. ప్రచారంలో ఉన్నట్టుగానే.. షర్మిల బీజేపీ వదిలిన బాణం అనేందుకు ఖమ్మం సభే ఉదాహరణ అంటున్నారు. తొలి మీటింగ్‌తోనే షర్మిల ఎజెండా ఏంటో తెలిపోయిందని.. ఇన్నాళ్లూ బీజేపీ చేస్తూ వచ్చిన విమర్శలే షర్మిల నోటి నుంచి వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కమలనాథులు కేసీఆర్‌ మీదకు షర్మిల బాణాన్ని వదిలారని అంటున్నారు. 

బీజేపీ నాయకులు కేసీఆర్‌పై ఇన్నాళ్లూ చేసిన విమర్శలన్నీ ఒక ఎత్తు. ఒక్క సభతో షర్మిల కేసీఆర్‌ను నిగ్గదీసి అడిగిన విధానం మరోఎత్తు. "తెలంగాణ ఆత్మగౌరవం దొర చెప్పుకింద నలిగిపోతోంది. కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిస అయింది. నీళ్లన్నీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే.. నిధులు కూడా వారికే.. నియామకాలు కూడా కేసీఆర్‌ కుటుంబానికే. నడిరోడ్డుపై లాయర్లను హత్య చేస్తే చర్యలేవి? టీఆర్ఎస్‌కు ఓట్లేస్తేనే జీతాలు పెంచుతామని టీచర్లను బెదిరించారు. ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు.. ఏమైంది? వైఎస్‌ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు.. కేసీఆర్‌ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు." అంటూ కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు షర్మిల. 

సూటిగా, సుత్తి లేకుండా షర్మిల చేసిన విమర్శలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నాయి. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలను ఈజీగా తీసుకోవడం.. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. నిలబెట్టుకోని హామీల గురించి కాంగ్రెస్‌ నిలదీయదని ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ.. టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లై చేసే కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదన్నారు. అంతే, అక్కడితో సరిపెట్టారు. తెలంగాణలో రోజురోజుకీ కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతుండటంతో హస్తం పార్టీని షర్మిల తన ప్రత్యర్థిగా భావించడం లేదని సరిపెట్టుకున్నా.. మరి, బీజేపీని ఎందుకు గట్టిగా నిలదీయలేదనేదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ అంటున్నట్టు.. షర్మిల బీజేపీ వదిలినా బాణమా?