పట్టిసీమలో భారీ అవినీతి అన్నారు... మరి మేఘా నుంచి 400కోట్లు రికవరీ చేస్తారా?

 

ప్రతిపక్షంలో ఉండగా భారీ అవినీతి జరిగిందన్నారు... అధికారంలోకి వచ్చాక... ఏ సంస్థ మీదైతే అవినీతి ఆరోపణలు చేశారో... ఆ కంపెనీకే కాంట్రాక్టులు కట్టబెట్టారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట... అధికారంలోకి వస్తే మరో మాట...ఇదీ వైసీపీ నేతల తీరు... రివర్స్ టెండరింగ్ తో పెద్దఎత్తున ప్రజాధనాన్ని ఆదా చేస్తామంటూ గొప్పు చెప్పుకుంటున్న జగన్... ఆనాడు చంద్రబాబు సర్కారు చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. పట్టిసీమ అంచనాలను ఇష్టానుసారం పెంచేసి మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి 400కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారంటూ ఆరోపించారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు నిజం అనిపించేలా కాగ్ సైతం పట్టిసీమలో అడ్డగోలు చెల్లింపులు జరిగాయని తేల్చింది. 

అయితే, ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా, ఏ కంపెనీ మీదైతే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారో... ఇఫ్పుడదే కంపెనీకి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కట్టబెట్టారు. మరి ఇదే సంస్థ పట్టిసీమ పనులు చేసింది. పైగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి 400కోట్లు చంద్రబాబు దోచిపెట్టారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పైగా, అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు హయాంలో జరిగిన పలు ఒప్పందాలను రద్దు చేయడమే కాకుండా అవినీతిని నిగ్గుతేల్చాలంటూ కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. అయితే, ప్రతిపక్షంలో ఉండగా, మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి 400కోట్లు అప్పనంగా ఇచ్చారని ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ఆ డబ్బును రికవరీ చేస్తారా? అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిజంగా ప్రజాధనం ఆదా చేయడమే జగన్ సర్కారు లక్ష్యమైతే, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి ఆ 400కోట్లు వసూలు చేయాల్సిందేనంటున్నారు.