కాంగ్రెస్‌లోకి విజయమ్మ!.. జగన్‌కు చెక్ పెట్టేందుకేనా!?
Published on: Wed Mar 16, 2022 10:46AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగొలుగా విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తగిన మూల్యం చెల్లించుకోంది. విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతే.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ బలంగానే ఉన్నా.. ఆ పార్టీ సీనియర్ నేతల అనైక్యత ఆ పార్టీ పుట్టి ముంచుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు గెలుపు నల్లేరు మీద నడక అవుతోంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
అయితే కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ ఆంధ్ర్రప్రదేశ్‌లో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం శాయశక్తుల ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులుగా ఉండి.. విభజన కారణంగా ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన కీలక నేతలను మళ్లీ సొంత గూటికి తీసుకు వచ్చేలా ప్రయత్నాలను సదరు పార్టీ తీవ్రం చేసినట్లు తెలుస్తోంది.
ఆ బాధ్యతను మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు కేవిపి రామచంద్రరావు భుజస్కంధాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టిందని విశ్వసనీయ సమాచారం. ఆ క్రమంలో తొలుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను మళ్లీ సొంత గూటికి తీసుకు వచ్చేందుకు కేవీపీ శతధా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలో కేవీపీ ఇప్పటికే ఆమెతో ఈ అంశంపై మాట్లాడినట్లు సమాచారం. వైయస్ రాజశేఖరరెడ్డి అంటే ఓ బ్రాండ్ అని... ఆ మహానేత ఇమేజ్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉందని.. ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి అని.. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్ని ఆటు పోట్లు ఏదురైనా ఆ పార్టీ చేయి విడిచిందీ లేదని.. అందుకే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిందనీ.. అయితే ఈ విషయాలన్నీ నేను కొత్తగా మీకు చెప్పనక్కర్లేదని.. ఇదంతా మీకు తెలుసునని కేవీపీ.. వైయస్ విజయమ్మతో అన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయం అయితే తీసుకోలేనని.. తనకు కొంత సమయం కావాలని కేవీపీని ఆమె కోరగా.. అందుకే టేక్ యువర్ ఓన్ టైమ్ అని.. వైయస్ విజయమ్మతో కేవీపీ పేర్కొనట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఆమె కుమారుడు వైయస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె కుమార్తె వైయస్ షర్మిల.. వైయస్ఆర్ టీపీ స్థాపించి... తెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఆమె పున:ప్రారంభించారు. వైయస్ విజయమ్మ.. కుమార్తెతో కలిసి అడుగులో అడుగు వేసుకొంటూ ఆ పాదయాత్రలో ముందుకు సాగుతోన్నారు.
అయితే తెలంగాణలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అంతగా జనాదరణ లభించడం లేదు. అలాగే మీడియాలో కూడా ఆమెకు అంతాగా కవరేజ్ ఇవ్వడం లేదు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ఆ పార్ట అధినేత కేసీఆర్‌లో చాలా బలంగా ఉంది. ఆ క్రమంలో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌లో కేసీఆర్ ఒప్పందం చేసుకుని.. ఆయన చెప్పినట్లు గులాబీ బాస్ నడుచుకొంటున్నారు. ఇంకోవైపు.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ.. తన హవా కొనసాగించింది. ఈ నేపథ్యంలో కమలదళం కూడా తెలంగాణలో పాగా వేసేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు సిద్ధంగా ఉంది.
ఇంకోవైపు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించాలనే లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీలోని సీనియర్లు ఎంతగా ఆయన్ని మోకాలడ్డుతోన్నా.. రేవంత్ మాత్రం తగ్గేదే లే అన్నట్లు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, డిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తెలంగాణలో కనీసం కొన్ని స్థానాలనైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో రేపోమాపో .. హైదరాబాద్‌లో ఆయన అడుగు పెట్టనున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వైయస్ షర్మిల.. తన పార్టీని ముందుకు తీసుకు వెళ్తుందా... అధికారంలోకి రాగలదా? అనే సందేహాలు వైయస్ విజయమ్మ చుట్టుముడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో ఆమె ఒకొంత ఆందోళన కూడా చెందుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లితే.. ఎలా ఉంటుంది అని.. తన చుట్టు ఉన్న అత్యంత ఆప్తులతో వైయస్ విజయమ్మ చర్చించినట్లు తెలుస్తోంది. అదీకాక తన భర్త వైయస్ రాజశేఖరరెడ్డికి... కాంగ్రెస్ పార్టీ అంటే పంచ ప్రాణాలు.. ఆ పార్టీ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రాణం పోస్తే.. తన భర్త ఆత్మకు కూడా శాంతి కలుగుతోందనే ఓ విధమైన ఆలోచనతో వైయస్ విజయమ్మ ఉన్నట్లు లోటస్ పాండ్‌లో ఓ చర్చ అయతే నడుస్తోంది.
ఓ వేళ వైయస్ విజయమ్మ.. కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఆమె కుమారుడు వైయస్ జగన్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అవుతోంది. అంతేకాదు.. తెలంగాణలో పార్టీ స్థాపించిన వైయస్ షర్మిల.. మళ్లీ ఏపీకి వెళ్లి.. సోదరుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతోందా? లేక తల్లిని మాత్రం ఏపీకి పంపించి.. తాను మాత్రం తెలంగాణలోనే ఉంటుందా ? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఏదీ ఏమైనా.. రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ బలం పుంజుకొని.. అధికారంలోకి వస్తే.. చేసిన తప్పులకు సరిద్దిద్దుకునే అవకాశం మాత్రం ఉంటుందని ఆంధ్రరాష్ట్ర ప్రజలు పేర్కొంటున్నారు. మరీ ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.


