TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వంగ‌వీటి-ప‌వ‌న్ కాంబినేష‌న్‌? కాపులంతా ఏకమ‌వుతున్నారా? జ‌గ‌న్‌కు మూడిన‌ట్టేనా?

Published on: Mon Oct 4, 2021 8:26PM

ఏపీ రాజ‌కీయ‌మంతా కాపుల చుట్టూనే తిరుగుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ట్రాట‌జీతో కాపు రాజ‌కీయం రంజుగా మారింది. కాపు, తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి.. కులాలంతా క‌లిసి మిగ‌తా వెన‌క‌బ‌డిన‌ సామాజిక వ‌ర్గాల‌కు నాయ‌క‌త్వం వ‌హించాలంటూ పిలుపు ఇచ్చారు జ‌న‌సేనాని. ప‌వ‌న్ పిలుపును ఇప్ప‌టికే చాలా మంది స్వాగ‌తిస్తున్నారు. కాపు సంఘం నేత‌లు పీకే ప్ర‌తిపాద‌న‌కు సై అంటే సైసై అంటున్నారు. 

మంగ‌ళ‌గిరి మీటింగ్‌లో ప‌వ‌న్.. కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న‌రంగా హ‌త్యోదంతం గురించి ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అభిమానులు రంగాకు కాపు కాసి ఉంటే ఆయ‌న చ‌నిపోయేవారు కాదుగా? అంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న లేవ‌నెత్తారు. ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా రంగా టాపిక్ తీసుకొచ్చార‌ని.. కాదు కాదంటూనే ఆయ‌న కాపు రాజ‌కీయం చేస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎవ‌రి ఉద్దేశ్యాలు, ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా.. ప‌వ‌న్ లేవ‌నెత్తిన కాపుల ఐక్య‌త.. బాగానే వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్టుంది. తాజాగా, వంగ‌వీటి రంగా త‌న‌యుడు రాధా సైతం కాపుల ఏకీక‌ర‌ణ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

తెలంగాణ‌లోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో త‌న తండ్రి మోహనరంగా విగ్రహాన్ని వంగ‌వీటి రాధా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగానికి రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. వైసీపీలో ప్ర‌కంప‌ణ‌లు రేపుతోంది. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే...
 
‘‘నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే.. అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు. మన నాయకుడు రంగాను మనం కాపాడుకోలేక పోయాం. ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ.. పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి’’ అంటూ వంగ‌వీటి రాధా సంచలన కామెంట్స్‌ చేశారు.

రాధా ప్ర‌సంగంలో కీల‌క అంశాలు ప్ర‌స్తావించార‌ని అంటున్నారు. ముందుగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టడ‌మే ల‌క్ష్యం అన్న‌ట్టు మాట్లాడారు. ఇటీవ‌ల.. తాను, ప‌వ‌న్ కాపు నా కొడుకులం.. అంటూ వాగిన మంత్రి పేర్ని నానిపై ప‌రోక్షంగా ఫైర్ అయ్యారు రాధా. పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందంటూ.. పేర్ని నాని టార్గెట్‌గానే ఆయ‌న ఆ వ్యాఖ్య‌లు చేశారు. 

ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని.. ఐకమత్యమే బలమ‌ని.. ఉన్నవారిని అయినా కాపాడుకోండని.. రాధా చేసిన ప్ర‌సంగం ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించే అంటున్నారు. అంటే, వంగ‌వీటి జ‌న‌సేన‌కు స‌పోర్ట్‌గా.. వైసీపీకి యాంటీగా మారార‌ని విశ్లేషిస్తున్నారు. ఇటు ప‌వ‌న్‌, అటు వంగ‌వీటిలు క‌లిసి.. కాపులంద‌రినీ ఏకం చేసి.. తెల‌గ‌, బ‌లిజ‌, ఒంట‌రి కులాల‌ను క‌లుపుకొని.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుపై తిర‌గ‌బ‌డే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని అంటున్నారు. అలా జ‌రిగితే.. ఇక వైసీపీ ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకే.