పీఠం దిగడమే మేలు.. ఉద్ధవ్ యోచన?!
Published on: Wed Jun 22, 2022 4:03PM
పరిస్థితులు అనుకూలించని స్థితిలో మొండిగా కుర్చీనే అంటిపెట్టకోవడం కంటే మంచి సలహాలను లెక్క లోకి తీసుకునీ పీఠం దిగిపోవడమే ఎంతో మేలు. మొత్తానికి మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయడానికే సి.ఎం. ఉద్దవ్ థాక్రే మొగ్గుచూపుతున్నారు. బిజెపీతో రాజీపడటం కంటే తప్పుకోవడం మంచిదన్న ఆలో చనలో ఉద్ధవ్ వున్నట్టు తెలుస్తోంది.
ఇదే మంచిదని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీల కూడా ఒప్పించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కూడా రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు ప్రస్తుత పరిస్థితి దారితీస్తోంది అంటూ ట్వీట్ చేయడం ఆ తర్వాత తొలగించడం గమనార్హం. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) సంకీర్ణ సర్కారు సం క్షోభంలో పడింది. విశ్వాస పరీక్ష పెడితే గట్టెక్కడం కష్టమే. లెక్కల విషయానికి వస్తే... మహారాష్ట్ర అసెం బ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 106 మంది, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంవీఏ సర్కారుకు 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌కు వెళ్లి పోయారు. షిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యా బలం 287గా ఉంది. అంటే విశ్వాస పరీక్ష పెడితే 144 మంది సభ్యులు ఉండాలి. తాజాగా 40 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఆ పార్టీ బలం 15కి పడిపోతుంది. ఫలితంగా సభలో సంకీర్ణ సర్కారు బలం 111కి తగ్గిపోతుంది. అయితే 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజా రిటీ మార్కు 111కి చేరుతుంది. మరోవైపు కొన్ని వార్తా సంస్థలు షిండేతో 35 మంది ఎమ్మెల్యేలున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్స్ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
ఏది ఏమైనా ఉద్ధవ్ సర్కార్ మైనారిటీలో పడిందన్నది మాత్రం ఖాయం. మెజారిటీ సభ్యులతో ప్రత్యేక క్యాంప్ మెయిన్ టైన్ చేస్తున్న ఏక్ నాథ్ షిండే మాదే అసలైన శివసేన అనే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో గౌరవంగా తప్పుకుంటే మేలన్న యోచన ఉద్ధవ్ చేస్తున్నారన్నది వారి అభిప్రాయం. షిండే బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. లేక బీజేపీ సర్కార్ కు మద్దతుగా నిలబడినా తరువాత క్షేత్ర స్థాయిలో షిండే నిర్వాకాన్నీ, బీజేపీ రాజకీయ అవకాశ వాదాన్ని ఎండగట్టడం ద్వారా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని ఉద్దవ్ ధాక్రే భావనగా చెబుతున్నారు.


