నిజంగానే తిట్టుకుంటున్నారా? సెంటిమెంట్ రాజేసే కుట్రలా?
Published on: Sat Nov 13, 2021 9:50AM
తెలుగు రాష్ట్రాల మంత్రులు మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ మంత్రులు జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. ఏపీ మంత్రులు కేసీఆర్ ను కార్నర్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరిగిందా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో సెంటిమెంట్ రాజకీయాలు రాజేస్తున్నారనే చర్చ కూడా వస్తోంది. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. రోజురోజుకు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అటు కేసీఆర్ సర్కార్ పైనా ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకు పెరిగిపోతోంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ మంత్రులు, ఇటు తెలంగాణ మంత్రులు మాటల మంటలు రాజేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార తెరాస అభ్యర్ధి ఓడి పోయారు. అయినా కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. అలాగే ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీకి ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనం కూడా పెద్దగా ఏమీ ఉండదు. అసెంబ్లీలో తెరాస బలం 103 నుంచి 102కు తగ్గితే, బీజేపీ బలం రెండు నుంచి మూడుకు పెరిగింది. రెండు పార్టీల మధ్య నిండా 100 సీట్ల దూరం వుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలకు పైగానే సమయముంది. అయినా కేసీఆర్, హుజురాబాద్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారని, ఒక విధంగా, ఆయన గతంలో ఎప్పుడూ లేనంతగా నిరాశ, నిస్పృహ, ఫ్రస్ట్రేషన్’కు గురవుతున్నారని రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అయన కొత్త ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.
కేంద్రం పై విరుచుకు పడడం మొదలు, తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందులో భాగంగానే మంత్రి ప్రశాంత రెడ్డి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద అసందర్భ విమర్శలు చేశారని అంటున్నారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రోళ్లన్నారని, ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. మోకాలుకు బోడి గుండుకు ముడివేసి అనవసర వివాదానికి తెర తీశారు. నిధులు లేక జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడ పలికింది ప్రశాంత ‘రెడ్డే’ అయినా, ఆయన చేత ఆ పలుకులు పలికించింది మాత్రం ముఖ్యమంత్రేనని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సామాజిక హెచ్చు తగ్గులు సహా ఆన్ని లెక్కలు చూసుకునే జగన్ ‘రెడ్డి’ పైకి ప్రశాంత్ ‘రెడ్డి’ ని ప్రయోగించారని అంటున్నారు.
అయితే ఏపీ మంత్రి పేర్నినాని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ఏపీకి రావాల్సిన నిధుల కోసమే బిచ్చమెత్తుకుంటున్నామని తెలిపారు. మాటిమాటికి ఢిల్లీకెళ్తున్న సీఎం కేసీఆర్..ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. బయట కాలర్ ఎగరేసి..లోపల కాళ్లుపట్టుకునే అలవాటు తమకు లేదన్నారు. తమది స్నేహం అంటే స్నేహం, ఢీ అంటే ఢీ నైజమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులున్నాయంటున్నారని, కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసిన.. హైదరాబాద్ సొమ్మును అనుభవిస్తున్నారని పేర్నినాని దుయ్యబట్టారు.
కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్ ఎస్ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ అని ఆయన ప్రశ్నించారు. వారి సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశా రు. వారి సమస్యల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే తెలం గాణ నేతలు ఇలా ఎపీ గురించి మాట్లాడుతున్నారన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి పబ్బం గడుపు గడుపు కుంటోందని, ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి, అనవసర వివాదాలను సృష్టించి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఎలా సమర్ధించు కుంటారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి హుజూరాబాద్ ఓటమిని వ్యక్తిగత ఓటమిగా భావిచడం వల్లనే ఫ్రస్ట్రేషన్’కు గురై తప్పు మీద తప్పు చేస్తూ తమ ప్రతిష్టను తామే దిగజార్చుకుంతున్నారని, ముఖ్యమంత్రి ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని, లేదంటే,రాజకీయాల్లో ఆత్మ హత్యలే కానీ, హత్యలు ఉండవనే నానుడి మరోమారు నిజం అవుతుందని విశ్లేషకులు మిత్ర వాక్యంగా హెచ్చరిస్తున్నారు.


