కరీంనగర్ పై కేసీఆర్ ఆందోళన? టీఆర్ఎస్ లో భయం మొదలైందా?

 

పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా, మిగతా చోట్ల డిపాజిట్లు సైతం రాకపోయినా, పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏకంగా నాలుగు చోట్ల విజయభేరి మోగించడమే కాకుండా, టీఆర్ఎస్ కు అత్యంత పట్టున్న, కీలకమైన స్థానాలను కైవసం చేసుకోవడంతో కేసీఆర్ జాగ్రత్తపడ్డారని చెబుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అంటే కరీంనగర్... కరీంనగర్ అంటే టీఆర్ఎస్ అన్నంతగా పేరు పడ్డ ఉద్యమాల గడ్డపై గులాబీ జెండాకి ఎదురుదెబ్బ తగలడాన్ని కేసీఆర్ అసలు జీర్జించుకోలేకపోతున్నారట. అందుకే, తన కేబినెట్ లో ఉమ్మడి కరీంనగర్ కు పెద్దపీట వేశారని అంటున్నారు. కీడెంచి మేలెంచాలన్నట్టుగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరీంనగర్ లో పట్టుకోల్పోకుండా జాగ్రత్తపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల దగ్గర్నుంచి రోజురోజుకీ బలపడుతోన్న బీజేపీని కట్టడి చేయడానికే, ఉమ్మడి కరీంనగర్ నుంచి నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇక కరీంనగర్ లో ఓడిపోయిన మాజీ వినోద్ కు కూడా కేబినెట్ ర్యాంకు పదవి ఇవ్వడంతో... మొత్తం ఐదుగురు మంత్రులని అంటున్నారు. అయితే, ఉమ్మడి కరీంనగర్ కు ఇన్ని పదవులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. బీజేపీకి భయపడే ఒక్క జిల్లాకు అన్ని పదవులు కట్టబెట్టారని, కరీంనగర్ ఎంపీ స్థానం కోల్పోయాక, అధికార టీఆర్ఎస్ లో వణుకు మొదలైందంటూ వ్యంగ్యస్త్రాలు వదులుతున్నారు. ఒక కరీంనగర్ బీజేపీ ఎంపీ కూడా సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. ఒక్కడిని ఎదుర్కోవడానికి నలుగురికి మంత్రి పదవులా అంటూ జోకులు పేల్చారు. 

అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుకు నలుగురు మంత్రులున్నా, వాళ్ల మధ్య సమన్వయం లేదనే మాట వినిపిస్తోంది. అంతేకాదు ఒక్క కేటీఆర్ కి తప్ప... ఎవరికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదని చెప్పుకుంటున్నారు. ఇక, ఈటల రాజేందర్-గంగుల కమలాకర్ కు అస్సలు పడటం లేదని, వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. పైగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కోల్పోవడానికి ఈటలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈటల ఇటీవల సృష్టించిన భూకంపం ఇంకా పార్టీలో కలకలం రేపుతూనే ఉంది. దాంతో, ఉమ్మడి కరీంనగర్ లో కేసీఆర్ ఊహించినట్లుగా బీజేపీకి చెక్ పెట్టడం అంత తేలిక కాదనే మాట వినిపిస్తోంది. అయితే, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో, ఉద్యమాల గడ్డ కరీంనగర్ పై ఎవరికి పట్టుందో త్వరలోనే తేలిపోనుందంటున్నారు.