జనసేనాని పొత్తు రచ్చ వెనుక వ్యూహమిదేనా?
Published on: Mon Jun 6, 2022 1:56PM
తా దూర సందు లేదు కానీ మెడకో డోలు అన్న చందంగా తయారైంది ఏపీలో బీజేపీ, జనసేనల మైత్రి యాత్ర. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ రచ్చరచ్చగా మారుతోంది. రాష్ట్రంలో బీజేపీకి ఓట్ల పరంగా కానీ, సీట్ల పరంగా కానీ సాధించేది దాదాపు శూన్యం. ఇక పవన్ కల్యాణ్ ఆయన పార్టీ జనసేన బలం ఎంత, వచ్చే సీట్లెన్ని, ఓట్లెన్ని అన్నది బరీజు వేయాలన్నా.. అంచనాకు రావాలన్న గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో ఆయన పార్టీకి వచ్చిన సీట్లు, ఓట్లు ఆధారంగానే రావాల్సి ఉంటుంది. రెండు సార్లు త్యాగం చేశా.. ఇక కుదరదు అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలలో వాస్తవం నిల్ అని పరిశీలకులు సోదాహరణంగా చెబుతున్నారు. ఆయన పోటీకి దూరం అంటూ ఎన్నికలకు దూరంగా ఉన్నది 2014 ఎన్నికలలో మాత్రమే. 2019 ఎన్నికలలో ఆయన సర్వసన్నద్ధంగా ఎన్నికల రణరంగంలోకి దిగారు. తూర్పుగోదావరి( అప్పటి ఉమ్మడి) జిల్లా రాజోలు నియోజకవర్గం వినా పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. స్వయంగా ఆయన పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ ఓడిపోయారు. అంటే గత ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన జనసేన పార్టీ గెలిచింది కేవలం ఒక్క స్థానంలో మాత్రమే. ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన బీజేపీతో మైత్రికి తహతహలాడారు. కుదుర్చుకున్నారు కూడా. 2019 ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్రానికి ఇవ్వ చూపిన ఆర్థిక ప్యాకేజీని పాచిపోయిన లడ్లుతో పోల్చి విమర్శలు గుప్పించిన ఆయన ఆ పార్టీతో చెలిమితరువాత ఎన్నడూ రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విశాఖరైల్వే జోన్, పోలవరం నిధుల గురించి అడిగింది లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు బీజేపీ, జనసేనలు పొత్తు రచ్చ ఆరంభించాయి. జనసేన బీజేపీతో అంటకాగడాన్ని ఆ పార్టీ అధినేత తెల్లారి లేస్తే తిట్టిపోసే జగన్ పార్టీకి మేలు చేయడానికేనా అన్నఅనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి. గత ఎన్నికలలో బీజేపీతో మైత్రి లేకపోయినా విడిగా పోటీలో నిలవడం వైసీపీకి అధికారాన్ని చేరువ చేయడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు మరో సారి అదే రిపీట్ చేయడానికి వ్యూహాత్మకంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వెలువడుతున్నాయి. లేకుంటే ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నన్ను ప్రతిపాదించాలన్న వాదనను జనసేనాని తెరపైకి ఎందుకు తీసుకువస్తారు. దానికి ప్రతిగా బీజేపీ నాయకుడు విష్ణు వర్ధన్ చెలరేగి మాట్లాడటం ఎవరినీ భుజాన మోయం అంటూ పరోక్షంగా జనసేనాని ప్రతిపాదనను ఖండించడం ఒక పొలిటికల్ డ్రామాకు తెరతీసినట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. నిన్నటి వరకూ ఓట్లు చీలనీయబోను అంటూ బల్లగుద్దిమరీచెబుతూ వచ్చిన జనసేనాని.. ఇప్పడు కొత్తగా తనను సీఎంగా అంగీకరిస్తేనే పొత్తులు అన్న అర్ధం వచ్చేలా ఆప్షన్లు ఇవ్వడం వెనుక బీజేపీ ప్రమేయం, ప్రభావం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
జనసేనాని ఆప్షన్లపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే బీజేపీ మాత్రం రాజకీయ పార్టీగా ఏపీలో అధికారమే తమ లక్ష్యమని అసాధ్యమైన లక్ష్యాన్ని ప్రకటించడంతో విశ్లేషకులకు చేతి నిండా పని పడింది. ఉరుము లేని పిడుగులా బీజేపీ ఇంతటి దూకుడుతో జనసేనాని ఆప్షన్లను ఖండించడమేమిటని నొసలు చిట్లించి మరీ తమ విశ్లేషణలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో పొత్తలను విచ్ఛిన్నం చేయడం వల్ల వైసీపీ ఎన్నికలలో లబ్ధి పొందుతున్న అంచనాల మేరకే ఇదంతా జరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
పొత్తుల విషయంతో తాను తగ్గేదేలే అని పవన్ కల్యాణ్ సినిమాస్టైల్ లో చెప్పిన డైలాగులవెనుక బీజేపీ వ్యూహాత్మక స్క్రిప్ట్ ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏదో అదృశ్య శక్తి పవన్ ను రాష్ట్రంలో జగన్ కు మేలు చేసేందుకు వీలుగా రాజకీయ నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నదని పరిశీలకులు అనుమానిస్తున్నారు. లేకుంటే బీజేపీకి రాష్ట్రంలో ఇసుమంతైనా పొలిటికల్ స్టేక్ లేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడా డిపాజిట్లు దక్కించుకునే పరిస్థితి లేదు. అటువంటి పార్టీతో పొత్తు కోసం జనసేనాని వెంపర్లాడటం చూస్తుంటే.. బీజేపీ ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తోందా? లేదా మరేదైనా ప్రలోభాలతో వశపరుచుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.
మిత్రపక్షంమైన బీజేపీ ఆత్మకూరులో పోటీకి దిగితే పవన్ కల్యాణ్ కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. అదే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి ఆ పార్టీ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. బీజేపీ, జనసేనలు రెండూ కలిసి వైసీపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు ఉందా అంటే అనుమానమే. జనసేనాని ఓటు బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు కొంత మేర చీల్చగలదు తప్ప సొంతంగా గెలిచేందుకు ఇసుమంతైనా దోహదపడదు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. జనసేనతో పొత్తు వల్ల ఒకటి రెండు స్థానాలను సాధించుకోగలదేమో గానీ, ఆ పార్టీకి ఇతరత్రా ఏ ప్రయోజనం ఉండదు. కానీ తెలుగుదేశంలో జనసేన కలవకుండా చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి మేలు చేయవచ్చు. ఇదే వ్యూహంతో కమలం పార్టీ పావులు కదుపుతున్నదన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 2019 ఎన్నికలలో కూడా జనసేన తన బలాన్ని మించిన విశ్వాసం ప్రదర్శించడం వెనుక కూడా కమల వ్యూహం ఉందన్న అనుమానాలను ఇప్పుడు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇచ్చిన ఆప్షన్లపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందనకు భిన్నంగా జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకునే రాష్ట్రంలో ఎన్నికలకు వెళతామని సోము వీర్రాజు వంటి వారు పవన్ కల్యాణ్ చెప్పిన ఆప్షన్లలో మొదటి ఆప్షన్ కే తమ మొగ్గు అని ప్రకటించడం చూస్తుంటే.. విష్ణు వర్థన్ రెడ్డి తాము అధికారం కోసమే పోరాడతాం అంటూ చేసిన వ్యాఖ్యలు జనాలను మభ్య పెట్టడానికేనని అవగతమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
సరిగ్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనకు వస్తున్నసందర్భంలోనే ఈ పోత్తుల రచ్చ మొదలు కావడం కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు. జనసేన తరఫున నడ్డాకు స్వాగతం పలకేందుకు జనసేన ఉవ్విళ్లూరడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. ఏ పొత్తులు ఎలా ఉన్నా.. జనం మాత్రం జగన్ ను ఇంటికి సాగనంపాలని నిర్ణయించుకున్నారనీ, అలా సాగనంపే బలం, సత్తా ఉన్న పార్టీనే వారు విశ్వసిస్తారనీ తెలుగుదేశం నాయకులు అంతర్గత సంభాషణల్లో విశ్వాసంతో చెబుతున్నారు. వార్ వన్ సైడే అని తమ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించిన సంగతిని వారి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.


