అభివృద్ధి అంటే ఇదేనా జగన్ రెడ్డీ?
Published on: Thu Apr 7, 2022 2:40PM
ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తికి అభివృద్ధికీ.. సంక్షేమ పథకాలకూ తేడా తెలియకపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘వలంటీర్లకు వందనం’ పేరుతో పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ ఉగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది కాదా అభివృద్ధి’ అంటూ.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథాకల పేర్లను ఏకరువు పెట్టడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తికి అభివృద్ధికీ.. సంక్షేమానికీ తేడా తెలియకపోతే ఎలా? అని విస్తుపోతున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక మొదలు బియ్యం కార్డులు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మ ఒడి, ఆరోగ్య ఆసరా, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, జగనన్న తోడు, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ కంటి వెలుగు, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, వైఎస్సార్ మత్స్యకార భరోసా, ఉగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర ఇలా అక్షరాల 33 పథకాలను ప్రతి ఇంటికీ అందజేస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు. ఇది కాదా అభివృద్ధి అంటే.. అంటూ ఓ అభివృద్ధికి ఓ సరికొత్త నిర్వచనం చెప్పారు సీఎం జగన్.. ఇలా ఆయన చెప్పిన పథకాలన్నింటినీ అభివృద్ధి కింద జమ వేస్తూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం, ఉపాధి అవకాశాలు పెంచేలా కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం.. అందుకోసం దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించి సంస్థలు ఏర్పాటు చేయించడం, నూతన రహదారులు నిర్మించడం, పాడైపోయిన పాత రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం, తద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం.. కంపెనీలు, సంస్థల్లో మరింతగా ఉత్పత్తులు సాధించడం లాంటి పనుల్ని కదా అభివృద్ధి అంటారని పలువురు చెబుతున్నారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా సరైన రోడ్డు ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులేవీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రారంభించడం కానీ, నడుస్తున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం కానీ లేదు కదా..? ఏవేవో తనకు తోచిన సంక్షేమ పథకాల పేర్లు చెప్పేసి ఇదే కదా అభివృద్ధి అనడం ఎంతవరకూ సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రారంభించని వైనాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. పైపెచ్చు ఆంధ్రుల జీవనాడిగా పేరు పొందిన పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా నత్త నడకన చేయిస్తుండడాన్ని ఏపీ ప్రజలు ప్రస్తావిస్తున్నారు. ఇక ఏపీలో ఎక్కడైనా ఒక్క కొత్త సంస్థో, కొత్త కంపెనీయో వచ్చిందా? అంటే అదీ లేదు కదా? అయినప్పటికీ ఇది కదా అభివృద్ధి అంటూ జగన్ రెడ్డి గొప్పగా ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ రెడ్డి సర్కార్ లోని పెద్దలు, వైసీపీ నేతల దురాగతాల కారణంగా ఏపీలో నడుస్తున్న కొన్ని కంపెనీలు దుకాణం సర్దేసిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
ఒక పక్కన విద్యుత్ కోతలతో ఏపీ వ్యాప్తంగా జనం ఇబ్బందుల పాలవుతున్నారు. దాంతో పాటు అనేక పరిశ్రమలు కరెంట్ లేక కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయాయి. దీంతో ఉన్న పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి తగ్గిపోయింది. ఉత్పత్తి లేకపోవడంతో అనేక పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కొన్ని సంస్థలు, పరిశ్రమలైతే సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా ఇక్కట్లు పడుతున్నాయంటున్నారు. మరో పక్కన విద్యుత్ చార్జీలు పెంచేశారు. ఇంకో పక్కన ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. వీటికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఏ వస్తువు కొనాలన్నా, ఏ సర్వీసు పొందాలన్నా షాక్ కొట్టే పరిస్థితి వచ్చిపడింది. కరెంట్ లేని దుస్థితిలో ఏపీలోని అనేక ఆస్పత్రుల్లో చీకటి రాజ్యం ఏలుతోంది. అత్యవసరంగా ఆపరేషన్లు చేయాల్సిన సమయంలో కూడా కరెంట్ లేక పలు ఆస్పత్రుల్లో వైద్యులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన పసికందుల్ని కూడా విద్యుత్ సరఫరా లేక ఆరుబయటకు తీసుకొచ్చి వారి బంధువులు ఇక్కట్లు పడుతున్నారు. మరి వీటన్నింటినీ అభివృద్ధి అంటారా జగన్ రెడ్డీ అని ఏపీ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పింఛన్లు, ఇతర కార్యక్రమాలు చేసి జగన్ రెడ్డి పేదల కళ్లల్లో సంతోషం, ఆనందం చూస్తున్నారంటున్నారు. అయితే.. విద్యుత్ లేక, రోడ్లు లేక, ప్రాజెక్టులు కట్టక, కడుతున్నవాటిని పూర్తి చేయక, ఒక్క పరిశ్రమ కూడా ఏపీలోకి రాక, వచ్చిన వాటిని తరిమేసి, ఉత్పత్తి లేక, రోడ్లు లేక, ఉన్న వాటిని మరమ్మతు చేయక, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించడమే అభివృద్ధి అని భావిస్తున్నారా? జగన్ రెడ్డీ అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ చందాన మీరు సంక్షేమ పథకాలను అభివృద్ధిగా చెప్పుకోవడం ఏమీ బాగాలేదంటున్నారు.


