ఆపరేషన్ ప్రియాంక గాంధీ ఫలిస్తుందా?

 

జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రియాంక.. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకను.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ తూర్పు ఇంఛార్జ్ గా నియమించారు. దీంతో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ఆఫీసియల్ అయింది. పోలికల్లో నాయనమ్మ 'ఇందిరా గాంధీ' లా ఉండే ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో ఎదురుచూసాయి. పోలికల్లోనే కాదు ఆవభావాలు, మాట తీరు ఇలా అన్నిట్లో ఇందిరాను గుర్తు చేస్తుంటుంది ప్రియాంక. అందుకే కాంగ్రెస్ లో ప్రియాంకను అభిమానించే వారు ఎక్కువ. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుండేవారు. ప్రియాంక ప్రచారానికి విశేష స్పందన వచ్చేది. ఓ రకంగా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రియాంక ముందున్న ప్రధాన లక్ష్యం.. యూపీలో కాంగ్రెస్ కి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం.

కేంద్రంలో అధికారం కావాలంటే యూపీలో గట్టిపట్టు ఉండాలన్నది రాజకీయ నానుడి. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్ కి గట్టిపట్టు ఉండేది. కానీ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది కేవలం 2 మాత్రమే. 2014లో రాయబరేలి, అమేథీల నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాత్రమే విజయం సాధించారు. కేంద్రంలో అధికారం కావాలంటే యూపీలో పట్టు అవసరమని భావించిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రియాంకను రంగంలోకి దింపింది. దీంతో యూపీ రాజకీయం గరంగరంగా మారింది.

గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ యూపీలో కొట్టుకుపోయాయి. వారణాసి నుంచి మోదీ పోటీచేసి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. యూపీలో బీజేపీ 71 స్థానాలు గెలుచుకుంటే.. ఎస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక బీఎస్పీ అయితే ఖాతా కూడా తెరవలేదు. అయితే ఇప్పుడు యూపీ రాజకీయాలు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ జతకట్టాయి. దీంతో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. తాజాగా కొన్ని సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ లతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే యూపీలో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ మాత్రం ఎందుకో కాంగ్రెస్ తో పొత్తుకి దూరంగా ఉంటున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల స్థానాలు రాయబరేలి, అమేథీలు మాత్రం కాంగ్రెస్ కు వదిలేస్తాం అంటున్నాయి. అంటే దాదాపు కాంగ్రెస్ యూపీలో ఒంటరి పోరే అనమాట. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ 2 సీట్లకే పరిమితమయ్యే ప్రమాదముంది. యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ప్రజాకర్షకనేత లేకపోవడం అని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రియాంకను రంగంలోకి దింపింది. దీనివల్ల గతంలో ఇందిరా గాంధీని అభిమానించే వాళ్ళు, అదేవిధంగా ప్రియాంకను వ్యక్తిగతంగా అభిమానించే యువత కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలున్నాయి.

అదేవిధంగా యూపీలో కుల సమీకరణాలు అధికంగా ఉంటాయి. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులు,ఠాకూర్లు బీజేపీ వైపు మళ్లారు. ఎస్సీలు బీఎస్పీ శిబిరంలో చేరగా.. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీకి సానుకూలంగా మారారు. దీంతో యూపీలో కాంగ్రెస్ కి కష్టాలు మొదలయ్యాయి. అయితే ప్రియాంక రాకతో ఇన్నాళ్లుగా పార్టీకి దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరకు వస్తాయని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యూపీలో కాంగ్రెస్ కి పూర్వవైభవం రాకపోయినప్పటికీ.. కనీసం 20 ఎంపీ సీట్లైనా గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుందట. మరి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్లు ప్రియాంక రాక కాంగ్రెస్ కి కలిసి వస్తుందా?. యూపీలో కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా?. తెలియాలంటే లోక్ సభ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.