రిగ్గింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు పాత్ర కూడా ఉందా?

 

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఏకంగా సుప్రీం కోర్టునే తప్పుపట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సుప్రీం కోర్టు రిగ్గింగ్‌కు పాల్పడుతోందా? అని వ్యాఖ్యానించారు. 100శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీవీప్యాట్‌ స్లిప్పులన్నింటినీ లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు ఎందుకు అంగీకరించడం లేదు? రిగ్గింగ్ వ్యవహారంలో కోర్టు పాత్ర కూడా ఉందా? అని ట్వీట్ చేశారు. ఎన్నికల నిర్వహణకు మూడు నెలలు తీసుకున్నపుడు.. ఫలితాలకు కూడా మూడు రోజులు పడుతుందిగా అని ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, వాయువ్య ఢిల్లీ బీజేపీ ఎంపీగా ఉన్న ఉదిత్ రాజ్ ఆ పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరారు.