కాంగ్రెస్ గూటికి సోనూసూద్ సోదరి.. 'గేమ్ ఛేంజర్' అన్న సిద్దు..
Published on: Tue Jan 11, 2022 1:28PM
సోనూసూద్ పరిచయం అవసరం లేని మంచి నటుడు, మహా మనిషి. నటుడిగా ఆయన ఎవరో తెలియని వారికి కూడా ఆయన మనిషిగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితులు. కరోనా సమయంలో వందల వేల మందిని ఆదుకున్న ‘మహా దాత’.. మనుషుల్లో దేవుడిగా వేల మంది ప్రాణాలను కాపాడారు. అయితే, ఇప్పుడు ఆయన కాదు, అయన సోదరి వార్తల్లో వ్యక్తిగా ముందుకు వచ్చారు.
సోనూ సూద్ అంతగా ప్రాచుర్యం పొందినా రాజకీయాల జోలికి వెళ్ళలేదు. రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేయలేదు. కానీ, ఆయన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశముంది. ఆ విధంగా ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
సహజంగా, ఎవరైనా ఎంతటి వారైనా ఏ పార్టీలో చేరినా పార్టీ కార్యాలయం, లేదా పార్టీ నేతల నివాసంలో పార్టీలో చేరతారు. కానీ, సోనూసూద్ సోదరిని పంజాబ్ చేర్చుకునేదుకు పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీ సోనూ నివాసానికి వెళ్ళి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాళవికా సూద్ పార్టీలో చేరడంపై సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని 'గేమ్ ఛేంజర్' గా అభివర్ణించారు. పీసీసీ చీఫ్, సీఎం ఇద్దరూ కలసి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం చాలా అరుదు అని తెలిపిన సిద్ధూ.. ఈ గౌరవం పొందడానికి మాళవిక అర్హురాలని కితాబిచ్చారు. స్వచ్ఛంద సంస్థ నడుపుతూ.. ప్రజాసేవకు అంకితమై మంచి పేరు తెచ్చుకున్న మాళవిక తమ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని సిద్ధూ అన్నారు.


