TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీనియర్లకి మరో ఛాన్స్!.. కేబినెట్లోకి వాళ్లు రీఎంట్రీ?

Published on: Fri Apr 8, 2022 2:48PM

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ క్రతువు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలోని 24 మంది మంత్రులు, ప్రస్తుత మంత్రివర్గం చిట్టచివరి సమావేశంలో రాజీనామా లేఖలు, ముఖ్యమంత్రి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. మనసులో ఏ బాధ, ఏ భావం ఉన్నా, ఎవరికి వారు మరో మాట మాట్లాడకుండా, జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా అలా నడుచుకుంటూ వెళ్లి పోయారు.అయితే అక్కడితో అయిపోయిందా? మంత్రులంతా మాజీలై పోయినట్లేనా? మరో మూడు రోజులో కొలువు తీరే కొత్త మంత్రి వర్గంలో మాజీలు ఎవరికి మళ్ళీ ఛాన్స్ దక్కదా, అంటే, అలాగని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. నిజానికి, ఇంకా ఇప్పటికీ మాజీలలో మళ్ళీ ఎంత మందికి మంత్రి పదవులు దక్కుతాయి? అనే విషయంలో, ఎవరికీ, చివరికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా పూర్తి క్లారిటీ లేదనే అంటున్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి ప్లస్, మైనస్ లెక్కలతో కుస్తీ పడుతున్నారని అంటున్నారు. మరో వంక సీనియర్లు ఎవరి స్టైల్లో వారు, వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు.  

నిజానికి నిన్న మొన్నటి వరకు మాజీలలో ఒకరిద్దరు మినహా, మిగిలిన ఎవ్వరికీ సెకండ్ ఛాన్స్ ఉండదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని చెప్పు కొచ్చారు. కానీ, మెల్లమెల్లగా ఆ సంఖ్య పెరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే, ఓ పదిమంది పాతకొత్త ముఖాలు మళ్ళీ బుగ్గకారెక్కుతారని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్ల విషయంలో ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నట్లు చెపుతున్నారు.
 
మంత్రుల పని తీరు, సామాజిక సమీకరణలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రభావ, ఫలితాల ఆధారంగా ముఖ్యమంత్రి మాజీలకు మళ్ళీ అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే,  ముఖ్యమంత్రి మనసు మార్చుకోవడానికి, ఇవేవీ కారణం కాదని, మాజీల వత్తిళ్ళకు తలొగ్గే ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నారని అంటున్నారు. పాత కొత్త ముఖాలుగా ప్రచారంలో ఉన్న పేర్లలో,పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణ, కొడాలి నాని,పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌,అంజాద్‌ బాషా, తానేటి వనిత ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే, ఇదేదీ కూడా ఫైనల్ కాదని చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు, కూడికలు తీసివేతలు కొనసాగుతూనే ఉంటాయని ఒక ప్రచారం జరుగుతోంది. మరో వంక ముఖ్యమంత్రికి  తమ కొత్త బృదం విషయంలో పూర్తి క్లారిటీ ఉందని, అయితే, ఇంకా ఆశ వదులుకోలేని  కొందరు సీనియర్లు కావాలని  ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. చివరకు ఏమి జరుగుతుంది? ఎవరు మంత్రి? ఎవరు మాజీ? తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు ఆగక తప్పదు.  

అదలా ఉంటే, ఏకంగా పది మంది మాజీలకు అవకాశం కలిపిస్తే, మూడేళ్ళుగా కలల్లో వత్తులు వేసుకుని మంత్రి పదవి  కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆర్కే రోజా అండ్ కో పరిస్థితి ఏమిటి?అనే చర్చ పార్టీలో జరుగుతోంది. నిజానికి ఒక్క రోజా అని కాదు, తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవి ఆశించి భంగపడిన ధర్మాన, ఆనం రామ నారాయణ,  తమ్మినేని అంబటి రాంబాబు, కరుణాకర రెడ్డి, చెవి రెడ్డి ఇలా చాలామందే తాజా విస్తరణలోనూ ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఎవరి ఆశలు నెరవేరతాయి,ఎవరి కలలు కల్లలవుతాయో.. ఏమో.