కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారా?

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి చివరి దశకి చేరుకుంటోంది. మరి కొద్ది రోజుల్లో ఎవరిని అధికారం వరించనుందో, ఎవరు ప్రతిపక్షానికి పరిమితం కానున్నారో తేలిపోనుంది. అయితే ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలో వస్తే కేసీఆర్ సీఎం అవుతారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు?. ఇది కొద్దిరోజులుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

నిజానికి అసెంబ్లీ రద్దుకి ముందు వరకు మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో మహాకూటమిగా ఏర్పడిందో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు వార్ వన్ సైడ్ అనుకున్నది కాస్తా.. టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వా నేనా అన్నట్టుగా మారింది. దీంతో టీఆర్ఎస్.. మహాకూటమిని ఎదుర్కోడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా విమర్శలు చేయటం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ మహాకూటమిని టార్గెట్ చేస్తూ చేసిన ప్రధాన విమర్శల్లో 'మహాకూటమి సీఎం అభ్యర్థి ఎవరు?' కూడా ఒకటి. 'కూటమిలో అసలు సీఎం అభ్యర్థి ఎవరో తెలీదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నేను సీఎం అంటే నేను సీఎం అని నేతలంతా కొట్టుకుంటారు. నెలకో సీఎం మారతారు' అంటూ టీఆర్ఎస్ కూటమి మీద విమర్శలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు చివరి దశకి చేరుకోవడంతో ప్రజలు కూడా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? అంటూ చర్చలు మొదలు పెట్టారు.

కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేత సీఎం కావడం ఖాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సీఎం అయ్యే కాంగ్రెస్ నేత ఎవరు?. ఇదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ లో సీఎం రేసులో ఉన్న నేతల లిస్ట్ భారీగానే ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, రేవంత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పొతే అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ అంత పెద్దగా ఉంటుంది. ఈ మధ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ అన్నట్టు ఒకవేళ 'మహిళా సీఎం' ప్రతిపాదన వస్తే విజయశాంతి, డీకే అరుణ లాంటివారు రేసులో ఉంటారు. అలాకాకుండా గతంలో కేసీఆర్ 'దళిత సీఎం' అని హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టి.. కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచిస్తే భట్టి విక్రమార్క జాక్ పాట్ కొట్టినట్టే.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మహిళా సీఎం, దళిత సీఎం మాటలు దాదాపు మాటలకే పరిమితం కావొచ్చు. కాబట్టి దాదాపు లిస్ట్ అంతా సీఎం రేసులో ఉన్నట్టే. అయితే ఈ లిస్ట్ లో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండు రేవంత్ రెడ్డి. వీరు ప్రచారానికి వెళ్లిన చోట్ల కార్యకర్తలు 'సీఎం.. సీఎం' అని అరవడం కూడా చూస్తున్నాం. తాజాగా రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక ప్రచార సభలో కూడా కార్యకర్తలు అలాగే నినాదాలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి 'దానికింకా సమయం ఉంది. నాకు ఓపిక ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడమే నా లక్ష్యం' అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయన సీఎం అవడానికి ఇంకా సమయం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారిని కాదని రేవంత్ ని సీఎం చేసే సాహసం అధిష్టానం చేయకపోవొచ్చు. అలా చేస్తే సీనియర్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. దీన్నిబట్టి చూస్తుంటే సీఎం రేసులో ఉత్తమ్ ప్రధమం అనమాట. ఉత్తమ్ ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మొదట్లో కొందరు నేతలు వ్యతిరేకించినా తరువాత సైలెంట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా ఉత్తమ్ ని సీఎం చేస్తే పార్టీ నేతల్లో వ్యతిరేకత అంతగా ఉండకపోవొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో చూడాలి. అయినా అసలు ఇదంతా జరగాలంటే ఫలితాలు కూటమికి అనుకూలంగా రావాలిగా. చూద్దాం మరి ఫలితాలు ఎలా వస్తాయో.