పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా?

 

'పాలించడానికి కాదు ప్రశ్నించడానికి వస్తున్నా' అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. దానికి తగ్గట్టే 2014 ఎన్నికల బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి అయితే వచ్చాయి కానీ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుంది అంటూ టీడీపీ, బీజేపీ మీద పోరాటం మొదలుపెట్టింది. అదే సమయంలో పవన్ కూడా సినిమాలకు బ్రేకిచ్చి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతా అంటూ.. టీడీపీకి దూరమయ్యారు. ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేనా యాత్రలు చేస్తూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైతే.. అసలు జనసేన బరిలోకి దిగుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు కానీ.. ఏపీలో ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం ఉండగానే పవన్ ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. దీనిబట్టి చూస్తుంటే పవన్ ప్రస్తుతం ఏపీ మీదే దృష్టంతా పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీలో యాత్రలు చేస్తూ ఎప్పుడూ టీడీపీ మీద, అప్పుడప్పుడు వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ ఈమధ్య ఎక్కువగా మాట్లాడుతున్న ఒక పాయింట్ మాత్రం అందరిని ఆలోచనలో పడేస్తుంది.

పవన్ మైక్ పడితే ఈమధ్య ఒక మాట బలంగా వినిపిస్తుంది. 'ఒక సీఎం మనవడు సీఎం కావొచ్చు.. ఒక సీఎం కొడుకు సీఎం కావొచ్చు.. కానీ ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా?' అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కాకూడదు అవొచ్చు. ఛాయ్ వాలా మోదీ పీఎం కాలేదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది ఒకటుంది. పవన్ మెగాస్టార్ తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తన టాలెంట్ తో పవర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. పవన్ ప్రజల దృష్టిలో సామాన్యుడు కాదు.. కానిస్టేబుల్ కొడుకు కాదు.. ఒక స్టార్ అనే విషయాన్ని గుర్తించాలి. ఒకప్పుడు పవన్ పాలించడానికి కాదు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చా అన్నారు. అంతేకాదు ప్రజలకు సేవ చేయాలంటే పదవే కావాలా? అని ప్రశ్నించారు. అలాంటి పవన్ ఇప్పుడు సీఎం సీఎం అంటున్నారు. పదవి లేకుండా సేవ చేయడం కష్టం అనుకున్నారో ఏమో తెలీదు కానీ ఈమధ్య పవన్ మాటల్లో సీఎం కావాలనే ఆశ మాత్రం కనిపిస్తోంది. ఆయన అభిమానులు కూడా కొందరు సీఎం సీఎం అని అరుస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం అవుతారని నమ్మకంగా ఉన్నారు. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవ్వడం సాధ్యమేనా అంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పవన్ కి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. పవన్ సభలకు భారీగా జనాలు తరలివస్తున్నారు. ఇది నిజం. కానీ ఈ ఫాలోయింగ్, సభలు ఇప్పటికిప్పుడు పవన్ ని సీఎం చేస్తాయా అంటే డౌటే. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రజలు సభలకు ఇలానే తరలివచ్చారు. ఇక చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మరి అలాంటి చిరంజీవికి ఆయన కుటుంబంలోని పవన్ లాంటి మిగతా హీరోలు తోడైనా.. అనూహ్యంగా కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. దీన్నిబట్టి ఫాలోయింగ్, సభలు సీఎం చేయలేవని అర్థంచేసుకోవచ్చు. అదీగాక జనసేన పార్టీ నిర్మాణం ఇంకా పూర్తీ స్థాయిలో జరగలేదు. ఇక పార్టీలో పవన్ తప్ప జనాన్ని ఆకర్షించదగ్గ నేతలు కూడా లేరనే చెప్పాలి. పవన్ కూడా ఉత్తరాంధ్ర మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప రాష్ట్రం మొత్తం మీద అంతగా దృష్టి పెట్టట్లేదు. అదీగాక ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కూడా బలంగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే పవన్ ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే అవకాశం తక్కువున్నా.. గెలుపు ఓటములను మాత్రం ప్రభావితం చేయగలరు. టీడీపీ, వైసీపీలకు పూర్తీ మెజారిటీ లేకపోతే పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి పవన్ వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతారో లేదో చూడాలి. అయితే పవన్ సీఎం అయ్యే అవకాశాలని పూర్తిగా కొట్టిపారేయలేం. ఆయన ఇప్పటికిప్పుడు సీఎం కాకపోయినా.. భవిష్యత్తులో అయినా సీఎం అవకాశాలున్నాయి. సేవచేయడానికి పదవులు అవసరంలేదని నమ్మిన పవన్.. పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంటే.. ప్రస్తుతం ఆయన్ని నమ్ముతున్న వారే కాదు.. మిగతావారు కూడా ఆయన్ని నమ్మి సీఎం అవకాశముంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.