TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాయిరెడ్డి టార్గెట్ గా విశాఖలో పీకే టీమ్ వర్క్? నెంబర్ టు రాజీనామా చేస్తారా? 

Published on: Wed Oct 6, 2021 9:51AM

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటారు. ఈ సామెత రాజకీయాల్లో ఎక్కువగా నిజమవుతుంటుంది. అధికారంలో ఓ వెలుగు వెలిగిన నేతలు కొన్ని రోజులకు కనమరుగవుతుంటారు. అనామకులు అందలం ఎక్కుతుంటారు. పవర్ లో హల్చల్ చేసే లీడర్లు.. తలరాత మారితే ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టుగా చెప్పుకునే ఎంపీ విజయసాయి రెడ్డి సీన్ అచ్చం అలాగే ఉందనే చర్చ సాగుతోంది. 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో, పార్టీలో సాయిరెడ్డి హవా సాగించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా జగన్ తో పాటు జైలుకు వెళ్లిన సాయిరెడ్డి.. వైసీపీలోనూ జగన్ తర్వాత  నెంబర్ టు అనే ప్రచారం జరిగింది. ఆయన వ్యవహారం కూడా అలానే ఉండేది. జగన్ తో ఏం పని జరగాలన్న విజయసాయితో చెబితే సరిపోతుందన్న టాక్ కూడా వచ్చింది. అలాంటిది కొన్ని రోజులుగా సాయిరెడ్డికి సీఎం జగన్ దగ్గర అపాయింట్ మెంట్ కూడా లేదని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీలో ఆయన ఖేల్ ఖతమైందనే చర్చ సాగుతోంది. ఇందుకు కారణం పీకే టీమ్ విశాఖలో పర్యటిస్తుండటమే. గతంలో వైసీపీ కోసం పనిచేసిన  ప్రశాంత్ కిశోర్ టీం మళ్లీ ఏపీలో అడుగుపెట్టింది. విశాఖలో తిరుగుతోంది. రెండు రోజులుగా ఈ టీం విశాఖ ప్రజల నుంచి పలు అంశాల మీద అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు.

విశాఖలో పీకే టీమ్ తిరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పీకే టీం విశాఖలో ఏం చేస్తోంది.. సీఎం జగన్ వాళ్లకు ఇచ్చిన టాస్క్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎంపీ విజయసాయి రెడ్డి చూస్తున్నారు. దీంతో విజయసాయి రెడ్డి వ్యవహారంపైనే పీకే టీమ్ వివరాలు సేకరిస్తుందనే చర్చ వైసీపీ వర్గాల నుంచి వస్తోంది. సాయిరెడ్డి కార‌ణంగా ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందనే సమాచారం సీఎం జగన్ కు వచ్చిందని అంటున్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాలు అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. భూ ఆక్రమణలు భారీగా వెలుగు చూస్తున్నాయి. విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు సాయిరెడ్డి తీరుపై సీఎం జగన్ కు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని గ్రహించిన జగన్ రెడ్డి.. పీకే టీమ్ ను అక్కడికి పంపించారని అంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలను కూల్ చేయడంతో పాటు సాయిరెడ్డి అక్రమ బాగోతాలపైనా పీకే టీమ్ ఫోకస్ చేసిందని తెలుస్తోంది. అందుకే  అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న నేత‌ల‌ను పీకే బృందం క‌లిసి వారి అసంతృప్తికి గ‌ల కార‌ణాలు, అధిష్ఠానం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు త‌దిత‌రాల‌పై వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ట‌. పార్టీ ఉత్త‌రాంధ్ర ఇంచార్జీగా ఉన్న సాయిరెడ్డికి ఈ విష‌యం ఇప్ప‌టిదాకా తెలియ‌నే లేద‌ట‌. పీకే బృందం విశాఖ‌లో రంగంలోకి దిగిన వైనం చూస్తుంటే.. ఉత్తరాంధ్ర ఇంచార్జీ బాధ్య‌త‌ల‌ నుంచి సాయిరెడ్డి నుంచి త‌ప్పించ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను జ‌గ‌న్ ముఖ్య స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. కేబినెట్ ర్యాంకులో ఈ ప‌ద‌విలో నియ‌మితులైన దాస్‌.. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ కేంద్రంగా విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుసంధానం క‌ల్పించే కీల‌క బాధ్య‌త‌ల‌ను దాస్ చూడబోతున్నారు. ఇప్పటివరకు ఈ పనిని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత హోదాలో చేస్తున్నారు. అయితే ఆయ‌న‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండానే దాస్‌ను ఢిల్లీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారుగా నియ‌మించేశారు. వైసీపీ త‌ర‌ఫున ప‌దేళ్ల‌కు పైగా రాజ్య‌స‌భ‌ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న సాయిరెడ్డి రెండో టెర్మ్ ప‌ద‌వీ కాలం వ‌చ్చే ఏడాది మే నెల‌తో ముగియ‌నుంది. మ‌రోమారు ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదని అంటున్నారు. రాజ్యసభ ఛాన్స్ మరోసారి లేదన్న సమచారం రావడం వల్లే సాయిరెడ్డి అలిగి సైలెంటుగా కూర్చున్నారని అంటున్నారు.  

తాజాగా చోటుచేసుకున్న రెండు కీల‌క ప‌రిణామాల‌తో  విజయసాయి రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆయన ఏకంగా వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికే రాజీనామా చేసేస్తారేమోన‌న్న వాద‌న‌లు కూడా వస్తున్నాయి. జ‌గ‌న్‌తో సాయిరెడ్డికి విడ‌దీయ‌లేని బంధం  ఉంది. త‌న ఆర్థిక వ్య‌వ‌హారాన్నింటినీ చ‌క్క‌బెట్టే సాయిరెడ్డిని జ‌గ‌న్ దూరం చేసుకోర‌ని సొంత పార్టీతో పాటు వైరి వ‌ర్గాలూ భావిస్తున్నాయి. మ‌రి అటు ఢిల్లీలో అధికారాల‌కు క‌త్తెరేసి.. ఇటు ఉత్త‌రాంధ్ర ఇంచార్జీ ప‌ద‌విని తొల‌గించేస్తే మ‌రి సాయిరెడ్డికి ఎలాంటి ప‌దవి అప్ప‌గిస్తార‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా సాయిరెడ్డి భ‌విష్య‌త్తు ఏమిట‌న్న విష‌యంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.