TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమారేనా?

Published on: Wed Apr 16, 2025 2:17PM

ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిల మధ్య పోరా జరగనుంది. ఇప్పటికే ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి కూమార్ యాదవ్ ను కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించేశాయి. మరి ఎన్డీయే కూటమి పరిస్థితి ఏమిటి? అంటే ఇంకెవరు నితీష్ కుమారే అంటున్నారు జేడీయూ నేత  రాజీవ్ రంజన్ ప్రసాద్.  అయితే ఆ విషయంలో ఏకాభిప్రాయం ఇసుమంతైనా లేదన్న విషయం ఇటీవలి పరిణామాల ద్వారా తేటతెల్లమౌతోంది. నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకతతో బీహార్ లో ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటికే రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ వైదొలగింది. ఈ సారి ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పశుపతి కుమార్ పరాస్ విస్పష్టంగా తేల్చేశారు. గత ఐదేళ్లుగా ఎన్డీయే కూటమిలో ఉన్న లోక్ జనశక్తి పార్టీ పేరుకు బీజేపీ దళిత వ్యతిరేక వైఖరి అంటూ వైదొలగినా.. వాస్తవ కారణం మాత్రం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వ్యతిరేకతతోనే అన్నది సుస్పష్టం. 

అంతే కాకుండా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ.. చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్డీయేలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఇటీవల హర్యానాలో జరిగిన ఓ కార్యక్ర మంలో ప్రసంగించిన సైనీ.. బీహార్ లో బీజేపీ విజయం తథ్యం అని అంటూనే..  బీహార్ ఉప ముఖ్యమంత్రి  సామ్రాట్ చౌదరి నాయకత్వంలో అది సాధ్యమౌతుందని చెప్పారు. ఆయన ఈ మాట సోమవారం (ఏప్రిల్ 14)న అన్నారు. అంతే వెంటనే అప్రమత్తమైన జేడీయూ.. మంగళవారం (ఏప్రిల్ 15)న బీహార్ లో ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమారే అని ఏకపక్ష ప్రకటన చేసేసింది.  ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూటమి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎదుర్కొంటుందనీ, అటువంటప్పుడు మరో ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ప్రశక్తే  లేదని జేడీయూ అంటోంది.  మొత్తం మీద బీహార్ లో ఎన్డీయే కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న విషయం ప్రస్ఫుటంగా బయటపడింది.