బిపిన్ రావత్ తర్వాత  సీడీఎస్ అతనే!

హెలికాప్టర్ ప్రమాదంలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మికంగా మృతి చెందారు. తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే.. తదుపరి సీడీఎస్ ఎవరనే అంశంపై ఊహాగానాలు ఇప్పడు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దేశ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చైనా దూకుడు చర్యలతో కవ్విస్తుండడంతో వీలైనంత తొందరగానే కొత్త సీడీఎస్ ను కేంద్రం నియమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సీడీఎస్ పోస్టు కొత్తగా సృష్టించింది కనుక బిపిన్ రావత్ తర్వాత సీనియర్ అంటూ ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో దేశ త్రివిధ దళాల్లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ను సీడీఎస్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలో చూసుకుంటే త్రివిధ దళాల్లోనే జనరల్ బిపిన్ రావత్ తర్వాత అత్యంత సీనియర్ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె అవుతారు. ఎందుకంటే.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్లు నవరణె కన్నా రెండేళ్ల జూనియర్లు. దాంతో ఎంఎం నరవణెను తదుపరి సీడీఎస్ గా నియమించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆర్మీ చీఫ్ గా నరవణె వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సి ఉంది. కాగా.. సవరించిన ఆర్మీ నిబంధనల ప్రకారం సీడీఎస్ 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు సేవలు అందించే అవకాశం ఉంది.

బిపిన్ రావత్ మరణించిన విషాదకర సమయంలో కూడా దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదనే సూత్రం ప్రకారం తదుపరి సీడీఎస్ ను త్వరగా నియమించాల్సి ఉంటుంది. అందుకే ప్రధాని నేంద్రమోదీ కూడా రావత్ మరణ వార్త తెలిసిన వెంటనే అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తదుపరి సీడీఎస్ గా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో పక్కన ప్రస్తుతం వైస్ సీడీఎస్ గా ఉన్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేరు కూడా సీడీఎస్ గా కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఒక వేళ నరవణె సీడీఎస్ గా నియమితులైతే.. ఆయన ప్రస్తుత స్థానంలో కొత్తగా ఆర్మీ చీఫ్ ను నియమించాల్సి ఉంటుంది. నరవణె తర్వాత ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి, నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వై కే జోషి సైన్యంలో సీనియర్లు. సైన్యం పోరాట సామర్ధ్యాన్ని పెంచేందుకు కేంద్రం నియమించిన షేకత్కర్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూసినా.. త్రివిధ దళాల చీఫ్ లలో ఒకరిని సీడీఎస్ గా నియించాలి. ఈ అంశం కూడా నరవణెకు సీడీఎస్ గా నియమితులు కావడానికి అనుకూల అంశంగా కానుంది.

నిజానికి బిపిన్ రావత్ కూడా సీడీఎస్ పదవి నుంచి వచ్చే ఏడాది రిటైల్ కావాల్సి ఉంది. అంతలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో తదుపరి సీడీఎస్ ఎంపికపై ముందుగాకే కేంద్రం కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.