ఎంపీ రఘురామ రాజు కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ?
Published on: Sat Nov 6, 2021 2:58PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మధ్య కొంత కాలంగా యుద్దమే సాగుతోంది. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, వైసీపీ నేతల అరాచకాలను బయటికి తీస్తూ వాళ్ల కంట్లో నలుసులా తయారయ్యారు రఘురామ. దీంతో రఘురామను టార్గెట్ చేస్తోంది జగన్ పార్టీ. రఘురామ అరెస్టు వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే అయింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామ. అటు వైసీపీ ఎంపీలు రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదుల మీర ఫిర్యాదులు చేస్తున్నారు.
ఢిల్లీలో రోజూ ప్రెస్ మీట్ పెడుతూ జగన్ రెడ్డి విధానాలను ఎండగడుతున్నారు ఎంపీ రఘురామ రాజు. ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం లేక వైసీపీ నేతలు సైలెంటుగా ఉంటున్నారు. తాజాగా శనివారం మీడియాతో మాట్డాడిన రఘురామ.. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంబంధించి కీలక విషయాలు చెప్పారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని ఎంపీ రఘురామ కొనియాడారు. అయితే మహాపాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తగా ఉండాలని అమరావతి రైతులకు సూచించారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు రఘురామ. ఆ మంత్రి వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరి, తాటికొండ ప్రజలపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బద్వేలు ఉప ఎన్నిక గెలుపు నిజమైన గెలుపు కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు రెక్కీ నిర్వహించారని ఆరోపించి సంచలం రేపారు. దీనిపై ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. ఏపీ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానన్నారు. సోలార్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.


