TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌పై మంత్రుల్లో అసహనం?

Published on: Wed Apr 6, 2022 3:26PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుత మంత్రుల్లో అసహనం పేరుకుపోయిందా..? ఇంతకాలమూ తమ అసంతృప్తిని బయటికి వెల్లడించలేక లోలోపలే వారు కుమిలిపోయారా? అంటే కొద్ది రోజులుగా కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు నిజమే కావచ్చనే విధంగా ఉంటున్నాయి.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరిని తప్పించి కొత్తవారికి బెర్త్ లు వేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పినప్పటి నుంచీ ఒక్కొక్క మంత్రి బయటికి వచ్చి తమలోని గూడుకట్టుకున్న అసహనాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారంటున్నారు. కొత్త కేబినెట్ లో తనకు చోటు దక్కదనే నిర్ణయానికి వచ్చిన వారే ఇలా జగన్ పై అసంతృప్తి వ్యవక్తం చేస్తున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వచ్చే కొత్త కేబినెట్ జాబితాలో తన పేరు ఉండదనే నిర్ణయానికి పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వచ్చేసినట్లున్నారు. మొన్నా మధ్య ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో తాను లేకపోతే విశ్వరూపం చూపిస్తానంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అంటే మంత్రిపదవిలో కొనసాగనివ్వకపోతే.. అనే నిరసనలోంచే సీఎం జగన్ కు హెచ్చరించారా? అనే అనుమానాలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్కన తాను బతికి ఉన్నంతవరకూ జగన్ చేయి వదలబోనంటారు. మరో పక్కన మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటారు. కొడాలి నాని తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వైసీపీ వర్గాల్లో అయోమయం నెలకొందంటున్నారు. 

ఇక డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఇంతకాలమూ వైభవాన్ని చవిచూసిన ధర్మాన కృష్ణదాస్ కూడా అదే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం విశేషం. కొద్ది రోజుల క్రితం ధర్మాన కృష్ణదాస్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడ్ని పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం. చంద్రబాబు విజ్ఞత గల సీఎం అన్నారు. అంటే.. కృష్ణదాస్ మాటల వెనుక తనకు కేబినెట్ హోదా పోతున్నదనే ఆదుర్దా, ఆక్రోశం ఉన్నందువల్లే అలా చంద్రబాబును పొగడడం ద్వారా వైసీపీ అధిష్టానానికి తన అసంతృప్తిని చెప్పకుండానే చెప్పారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తన మంత్రి పదవి త్వరలోనే పోతుందని, తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు మంత్రి అవుతారంటూ నరసన్నపేట నియోజకవర్గం జలుమూరులో మాట్లాడుతూ చెప్పడంలో ఆయనలోని ఆవేదన కనిపించిందంటున్నారు. అంటే తనకు మంత్రి హోదా పోయినా తమ్ముడికి వస్తున్న సంతోషం ఏమైనా ఉందో లేదో అనే అనుమానాలు స్థానికుల్లో కలిగాయంటున్నారు. అక్కడితో ఆగకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత తాను జగన్ వెంటే నడిచానని, ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసినా సీఎం తనను కేబినెట్ లో కొనసాగించకుండా అవమానిస్తున్నారనే భావన కృష్ణదాస్ లో కలిగిందంటున్నారు. తనకు మంత్రి పదవి పోయినా.. తమ్ముడు ప్రసాదరావు మంత్రి అయినా.. తమ కుటుంబంలో ఎవరో ఒకరు కేబినెట్ లో ఉంటారని, తమ కుటుంబం అంతా ఒక్కటే అన్నా.. కృష్ణదాస్ లోని అసంతృప్తి మాత్రం బయటపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరో మంత్రి పేర్ని నాని కూడా తనకు పునర్వ్యవస్థీకరణలో బెర్త్ లభించకపోవచ్చనే బాధను మొన్నటి మీడియా సమావేశంలో వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. గురువారం జరిగే కేబినెట్ భేటీయే తనకు చివరి భేటీ అంటూ తన మనసులోని బాధను బయటపెట్టేశారంటున్నారు. మంత్రిగా తన అధ్యాయం ముగిసిందని పేర్ని నాని చెప్పడంతో తన మనసులోని బాధను, అక్కసును సున్నితంగా వ్యక్తం చేశారనే అభిప్రాయాలు వస్తున్నాయి.

ఇక జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణకు కూడా కేబినెట్ పదవులు దూరం కావాల్సి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు తమకు మంత్రి పదవులు పోయినా.. తమ తమ జిల్లాల్లో మరొకరికి ఛాన్స్ ఇవ్వొద్దని సీఎం జగన్ కే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకునే పరిస్థితి తీసుకురావద్దని కోరినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసే కేబినెట్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పించి.. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు స్థానం కల్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే తప్పించండి కానీ.. చిత్తూరు జిల్లా నుంచి ఇంకెవరికీ కేబినెట్ లో చోటు ఇవ్వొద్దని మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద పదవులు కోల్పోతున్నామనే ఆందోళన, ఆవేశం, ఆక్రోశం ఇంకా పలువురు మంత్రుల్లో ఉందంటున్నారు. కొందరు చెప్పీ చెప్పనట్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు తమ బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక సతమతం అవుతున్నారని అంటున్నారు. కొత్త కేబినెట్ కు ముహూర్తం పెట్టిన సీఎం జగన్ పార్టీలో అంతర్గత అసంతృప్తులకు అవకాశం కల్పించారనే వ్యాఖ్యలు వస్తున్నాయి.