TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ ఫ్యాన్స్‌కు కేటీఆర్ గాలం?

Published on: Thu Feb 24, 2022 4:46PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గాలం వేశారా? ఇప్పటికే రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర అధికార పీఠాన్ని అధిష్టించిన సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతున్నట్లు మీడియాలో వర్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ను, తెలంగాణలో 6 శాతం ఉన్న మున్నూరు కాపు ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకు  వారు ప్రయత్నిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానం వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, జరుగుతున్న పరిణామాలతో పవన్ ఫ్యాన్స్ ను ప్రసన్నం చేసుకుని వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలనే ముందస్తు ప్రణాళికతోనే కేటీఆర్ ముందుకు వెళ్తున్నారంటున్నారు.

నిజానికి సినిమాలు, సినిమా వాళ్లు అంటే గతంలో కేసీఆర్, కేటీఆర్ అంతగా పట్టించుకోరనే అభిప్రాయం ఉంది. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ సినిమా ఫంక్షన్లకు హాజరవుతుండడం విశేషం. అందులోనూ మెగా కాంపౌండ్ నుంచి జరిగే కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతుండడం గమనార్హం. ఓ మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా ఓ సోదరుడిగా పవన్ కళ్యాణ్ పిలిస్తే తాను వచ్చానన్నారు. మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలితో మాస్ ఫాలోయింగ్ ఉండే నటుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్దల అండదండలు ఉంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమకే హైదరాబాద్ ఒక కేంద్రంగా మారుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా మొగిలయ్య, దుర్గాబాయి, శ్యామ్ లాంటి అనేక మంది అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తీసుకొచ్చారని ప్రశంశించ‌డం వెనుకా.. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఓట్లు రాబట్టుకునే గాలం వేశారనే విశ్లేషణలు రాజకీయ నిపుణుల నుంచి వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో సాన్నిహిత్యం ద్వారా ఆయన ఫ్యాన్స్ నుంచి మద్దతు కొల్లగొట్టవచ్చనే వ్యూహం ఏదో కేటీఆర్ లో ఉందంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉంటే.. ఆయన సామాజికవర్గానికి చెందిన మున్నూరు కాపు ఓటర్లను కూడా ఆకర్షించాలనే ఎత్తుగడ ఏదో ఉండొచ్చంటున్నారు.

మొత్తం మీద భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ అటు స్వకార్యం, ఇటు స్వామి కార్యం కూడా చక్కబెట్టేందుకు వినియోగించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.