తెలంగాణలో జనసేన పరిస్థితి ఏంటి?

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల వేడి పెంచారు.. దీంతో విపక్షాలు కూడా పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి.. అయితే ఒక పార్టీ తీరు మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు.. అదే జనసేన పార్టీ.. ప్రశింస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపారు.. తరువాత వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఒంటరిగా అడుగులు మొదలు పెట్టారు.. ఏపీలో ఐతే పవన్ పర్యటనలు, ప్రభుత్వం మీద విమర్శలతో ప్రజల్లోకి వెళ్తూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు కానీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

 

 

తెలంగాణలో అసలు ఇంతవరకు జనసేన బలపడే ప్రయత్నమే మొదలు పెట్టలేదు.. నాయకులు కూడా లేరు.. ఓ వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్ని పార్టీలు బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంటే.. జనసేన మాత్రం ఆ ఊసే లేదు.. ఇలానే ఉంటే ముందస్తు వస్తే తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ప్రశ్నార్ధకం అవుతుందనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇంతవరకు వరకు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టలేదు.. ముందస్తు వస్తే తక్కువ సమయంలో పార్టీ నిర్మాణం, బలోపేతం కష్టమవుతుంది.. కొందరైతే అసలు జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. అయితే కార్యకర్తలు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జనసేన అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుంది అంటున్నారు.

 

 

మరోవైపు జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే సీపీఎం పార్టీ జనసేనతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది.. మరో వైపు విపక్షాలు కూడా ఏ పార్టీ వచ్చినా కలుపుకొని పోవాలని చూస్తున్నాయి.. కానీ జనసేనాని మాత్రం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు.. ఓ వైపు ముందస్తు వేడితో మిగతా పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలు పెడితే జనసేన మాత్రం మౌనంగా ఉండిపోయింది.. దీన్నిబట్టే చూస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బరిలోకి కష్టమనే విశ్లేషకులు భావిస్తోన్నారు.. మరి జనసేన మౌనానికి అసలు కారణం ఏంటి?.. మౌనంగా ఉండి వ్యూహాలు రచిస్తోందా?.. ఒంటరిగా బరిలోకి దిగుతుందా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా?.. లేదా అసలు బరిలోకి దిగదా?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే జనసేన మౌనం వీడాలి లేదా ఎన్నికలు రావాలి.. చూద్దాం ఏం జరుగుతుందో.