బీజేపీపై జగన్ సర్కార్ యుద్ధమా.. వ్యాట్ తగ్గించకుండా కుప్పిగంతులా?
Published on: Sun Nov 7, 2021 12:16PM
పెట్రోల్, డీజిల్ ధరల చుట్టే ప్రస్తుతం దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. కేంద్ర సర్కార్ ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై ఐదు , లీటర్ డీజిల్ పై 10 రూపాయులు తగ్గింది. కేంద్రం తన పరిధిలోని పన్ను తగ్గించడమే కాదు.. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని సూచించింది. మోడీ సర్కార్ సూచనతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు చమురుపై వ్యాట్ తగ్గించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో 12 రూపాయల వరకు లీటర్ పెట్రోల్ పై ధర తగ్గింది. కాని తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించడం లేదు. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లలో ఏపీలో టాప్ 2లో ఉంది. అయినా ఏ మాత్రం వ్యాట్ తగ్గించడం లేదు జగన్ రెడ్డి సర్కార్.
పెట్రోల్, డీజిల్ పై ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ వ్యాట్ తగ్గించాలని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాట్ తగ్గించాల్సిన జగన్ ప్రభుత్వం.. కేంద్ర సర్కార్ పై యుద్ధం ప్రకటించడం దుమారం రేపుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం టార్గెట్ గా ఆదివారం పత్రికల్లో పెద్ద సైజు యాడ్స్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సీఎం జగన్ ఫోటో వేసి మరీ 'పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత?. తగ్గించింది ఎంత?. లీటరు ధర 100 రూపాయలు దాటించి ఐదో, పదో తగ్గించాం అంటూ పెంచిన వారే రోడ్ల మీదకు వచ్చి నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా' అని ప్రశ్నించింది. ఒకరేమో ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మరొకరు తమ హయాంలో ఎంత పెంచారు అన్నది మరచి రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న సదుద్దేశంతోనే, వినయపూర్వకంగా అసలు నిజాలు మీ ముందు ఉంచుతున్నాం అంటూ యాడ్ లో పేర్కొన్నారు.
అంతే కాదు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 3,35,000 కోట్లరూపాయల పన్నులు వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,475 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కేవలం 5.80 శాతం. వాస్తవంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉన్నప్పటికి పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్ లోకి రాకుండా సెస్ లు, సర్ ఛార్జీలరూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా? అని యాడ్ లో ప్రశ్నించింది జగన్ రెడ్డి ప్రభుత్వం.
పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి. బిజెపి, టీడీపీ చేసే రాజకీయ విమర్శలకు కూడా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ప్రధాన పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇవ్వటం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఇప్పటికే ఏపీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు యాడ్స్ తో సమాధానం చెప్పటం ఏమిటినే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్షాల విమర్శల్లో అవాస్తవాలు ఉంటే..పార్టీపరంగా..ప్రభుత్వపరంగా వాస్తవాలు ప్రజలకు చెప్పటంలో ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ రాజకీయ విమర్శలకు ప్రజల సొమ్ముతో పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వటంపై అధికారులు కూడా అవాక్కవుతున్నారు.
నిజంగానే ఏపీ సర్కారు చెప్పినట్లు కేంద్రం ఇలా మోసం చేస్తే ఈ విషయంపై ఇప్పటివరకూ కేంద్రానికి ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాయలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమాలను సరిదిద్దాలని గట్టిగా డిమాండ్ చేయటం కానీ..ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ఎక్కడైనా చేశారా? అని నిలదీస్తున్నారు. చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకపోతే దీనిపై వైసీపీ చేసిన పోరాటం ఏమిటి? అని అడుగుతున్నారు. ఇప్పటివరకూ ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నట్లు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీలు ఇవ్వకపోతే బిజెపి సర్కారు మరో అన్యాయం చేస్తే వైసీపీ ఎందుకు మౌనంగా భరిస్తున్నట్లు? అన్నది తేలాల్సి ఉంది. అయినా పక్క రాష్ట్రాలు కేంద్రం బాటలోనే పన్నులు తగ్గించి వాహనదారులకు ఊరట కల్పిస్తే.. అలా చేయకుండా ఇలా యాడ్స్ తో ఎదురుదాడి ప్రారంభించడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. ఇలాంటి చర్యలతో జనాల్లో మరింత చులకన కావడం ఖాయమని అంటున్నారు.


