TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాగినచోటే సారా తయారు చేస్తారా జగన్‌ రెడ్డీ?

Published on: Tue Mar 15, 2022 5:59PM

జంగారెడ్డిగూడెంలో కల్తీ మరణాల అంశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పట్టుపడుతున్నారు. దానికి అధికార వైసీపీ నో చెబుతోంది. దాంతో ఎలాగైనా తమ పంతం నెగ్గించుకోవాలని టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడం.. ఆపైన వారిని సభ నుంచి స్పీకర్ బహిష్కరించడం జరిగిపోయాయి. సభ నుంచి టీడీపీ సభ్యులను బయటికి పంపించిన తర్వాత సీఎం జగన్మోహన్‌ రెడ్డి స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో 55 జనాభా ఉన్నారని, మున్సిపల్‌ వ్యవస్థ, వార్డు సచివాలయాలు, పోలీస్‌ స్టేషన్‌ ఉన్న అలాంటి ప్రాంతంలో నాటుసారా తయారు చేయడం సాధ్యమా? అంటూ ఓ దేవ రహస్యాన్ని చెబుతున్నట్లు సీఎం జగన్‌ రెడ్డి బిల్డప్ ఇచ్చారు. పైగా జంగారెడ్డిగూడెం మరణాలపై తెలుగుదేశం పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆరోపించారు.

అయితే.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి శాసనసభ వేదికగా అబద్ధాలు మాట్లాడవచ్చా? అనే విమర్శలు విపక్షాల నుంచి.. మరీ ముఖ్యంగా టీడీపీ నేతల నుంచి వస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో తాగి చనిపోవడానికి అక్కడే నాటుసారా తయారు చేయాలా? మరి ఎక్కడైనా తయారుచేసి, జంగారెడ్డిగూడెంలో విక్రయించవచ్చు కదా అంటున్నారు. పైగా ‘బూమ్‌.. బూమ్‌’, ‘ప్రెసిడెంట్ మెడల్‌’, ‘ఆంధ్రా గోల్డ్‌’, ‘పెన్షన్ 3,000’,’స్పెషల్ స్టేటస్‌’, ‘రైల్వే జోన్‌’ లాంటి సరికొత్త బ్రాండ్ల పేరుతో చీప్‌ లిక్కర్‌ విక్రయాలకు జగన్ రెడ్డి సర్కార్ తలుపులు బార్లా తెరిచిందని, తద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటోందని టీడీపీ నేతలు గతం నుంచే అవకాశం ఉన్న ప్రతి వేదిక మీదా ఆరోపిస్తూనే ఉన్నారు.

నిజానికి నాటుసారా స్థానికంగా తయారు చేస్తేనే అమాయక ప్రజలు తాగుతారా? ఇతర ప్రాంతాల్లో కూడా తయారు చేసి, ఎక్కడికక్కడ విక్రయాలు చేసే అవకాశం లేదా? అలాంటి అవకాశం లిక్కర్‌ డబ్బులకు రుచిమరిగిన జగన్‌ సర్కార్‌ ఇవ్వలేదనుకోవాలా? అని వారు నిలదీస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి చెబుతున్నట్లు జంగారెడ్డిగూడెం లాంటి పట్టణాల్లో నాటుసారా తయారీ కాకపోవచ్చు కానీ, విక్రయాలు యధేచ్ఛగా జరుగుతుండడం వల్లే ఇలా నిరుపేదలు, అమయక ప్రజలు తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వారు ఫైర్‌ అవుతున్నారు. నాటుసారా మరణాలు ఒక్క జంగారెడ్డిగూడెంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయని, అయితే.. అనేక చోట్ల నాటుసారా మరణాలు బయటి ప్రపంచానికి తెలియడం లేదంటున్నారు.

టీడీపీ హయాంలో మంచి ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్‌ ను అన్ని విధాలా నాశనం చేసిన జగన్‌ రెడ్డి సర్కార్‌.. చివరికి మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి పాలన సాగిస్తోందని, అందుకే నాటుసారా తయారీకి, విక్రయాలకు రహస్యంగా ఓకే చెప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్కన నాటుసారా తాగి పలువురు చనిపోతుంటే.. అవి సహజ మరణాలని లెక్క చెప్పేందుకు జగన్‌ రెడ్డి సర్కార్ యత్నించడం పట్ల టీడీపీ నేతలు తూర్పారపడుతున్నారు. నాటుసారాతో మనుషుల ప్రాణాలు నిలువెల్లా తీసేసి ఆంధ్రప్రదేశ్ ను వల్లకాడుగా మార్చేయాలనే కుతంత్రం ఏదైనా వైసీపీ సర్కార్ చేసిందా? అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మృతులకు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయని, మిగిలిన మృతదేహాలకు ప్రభుత్వం పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించిందని చెప్పడం సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఒక పక్కన అమాయకులు నాటుసారా కారణంగా పిట్టల్లా రాలిపోతుంటే అసెంబ్లీ వేదికగా సీఎం ఇలా అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 55 వేల జనాభా ఉన్న చోట ఎవరైనా నాటుసారా కాస్తారా? అంటూ జగన్ ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్నారు. ఒక పక్కన చీప్ లిక్కర్‌ కు, కనీ వినీ ఎరుగని కొత్త మద్యం బ్రాండ్లకు రాష్ట్రంలో గేట్లు తెరిచేసి, మరో పక్కన సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపుతామంటూ సీఎం జగన్‌ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందంటున్నారు. పైగా జంగారెడ్డిగూడెంలో మరణాలు ఒకే రోజు, ఒకే ప్రాంతంలో జరిగినవి కాదని సీఎం జగన్‌ రెడ్డి చెప్పడం ఆయన నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి. నాటుసారా చావుల విషయంలో కూడా ఇంత టెంపరితనంతో మాట్లాడుతారా? అంటూ పలువురు ఫైరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్‌ రెడ్డి, వైసీపీ సర్కార్ భ్రష్టు పట్టించారని విపక్షాలు, ప్రజలు కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.