కోనసీమా కాశ్మీరా?!.. ఇంటర్నెట్ సేవలాపేయడమేంటి?
Published on: Tue May 31, 2022 1:49PM
కోనసీమ.. పచ్చదనానికి, ప్రశాంతతకు, ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక. గోదావరినది రెండు పాయల మధ్య భూలోక స్వరంగా ఉండే కోన సీమ జగన్ పాలనలో ఇప్పుడు కశ్మీర్లో జరిగే అల్లర్లు, విధ్వంసాలు, గృహదహనాలకు నెలవైంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తామంటూ వైసీపీ సర్కార్ వెల్లడించినప్పటి నుంచీ ఈ ప్రశాంత సీమ విధ్వంస సీమగా మారిపోయింది. వైసీపీ సర్కార్ పెట్టిన చిచ్చు ఇప్పుడు కోనసీమలో కులాలు, మతాలు, మనుషుల మధ్య విభేదాలు, దాడులు, ప్రతిదాడులు, చివరికి జిల్లా కేంద్రం అమలాపురంలో పోలీసులపై రాళ్లదాడులు, గాల్లోకి పోలీసు తుపాకీ గర్జనలు వంటి అవాంఛనీయ సంఘటనలకు దారి తీసింది.
అయితే.. అల్లర్లు, వాట్సాప్ మెసేజ్ లతో ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయనే నెపంతో ముందస్తు చర్యల్లో భాగంగానేనని చెబుతూ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి ఉద్యోగాలు కల్పించలేని ఏపీ సర్కార్ ఇప్పుడు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్న వందలాది మంది కోనసీమ ఐటీ ఉద్యోగులకు ఇంటర్ నెట్ సేవలు అందుబాటులో లేకుండా చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అమలాపురం అల్లర్లు ఐటీ ఉద్యోగులకు శాపంగా మారిందని వాపోతున్నారు.
ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన ట్విట్టర్ వేదికగాప్రస్తావించి ‘ఎక్కడో కశ్మీర్ లో వినిపించే ఇంటర్ నెట్ సేవలు నిలిపివేత’ వార్తను కోనసీమలో వినాల్సి రావడం బాధాకరం అన్నారు. అమలాపురంలో విధ్వంసం జరిగి వారం రోజులైనా అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించని వైసీపీ సర్కార్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి అసమర్ధ పాలనకు అమలాపురం అల్లర్లు, ఇంటర్నెట్ సేవల బంద్ నిదర్శనం అని ఆయన తూర్పారపట్టారు. సామాన్యుడి జీవితంలో ఇంటర్నెట్ కూడా ఒక భాగం అయిందనే విషయం వైసీపీ సర్కార్ తెలుసుకోవాలని చంద్రబాబు గుర్తుచేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు ఇవ్వలేని వైసీపీ సర్కార్ కనీసం.. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకునేందుకైనా వెసులుబాటు లేకుండా చేయడం దారుణం అంటున్నారు.
నిజానికి ఇంటర్ నెట్ అనేది ఐటీ ఉద్యోగులకే కాకుండా వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులకు కూడా దైనందిన అవసరంగా మారిపోయింది. ఇంటర్ నెట్ లేకపోతే వారి రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర విఘాగం కలుగుతుంది. జనజీవనంతో పెనవేసుకుపోయిన ఇంటర్ నెట్ ను వారం రోజులుగా బంద్ చేయడంపై వేలాది మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు అధికంగా ఉన్న కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. కోనసీమ అనేది ఆ ప్రాంత వాసుల నరనరాల్లో జీర్ణించుకుపోయిన పేరు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరు వైసీపీ సర్కార్ ముందుగానే పెట్టి ఉంటే పెద్దగా అభ్యంతరాలు వచ్చి ఉండేవి కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ముందు కోనసీమ జిల్లా అని పేరు ప్రకటించి, ఆనక దాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం వెనక జగన్ సర్కార్ విధ్వంస కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


