TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంక్రాంతి సెల‌వులు పొడిగింపు? భారీగా కొవిడ్‌ కేసులు..

Published on: Sat Jan 15, 2022 11:32AM

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెల‌వులు ఉన్నాయి. సోమ‌వారం త‌ర్వాత నుంచి రీఓపెన్ కానున్నాయి. కానీ, ఇదే స‌మ‌యంలో.. సంక్రాంతి సెల‌వుల్లో.. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఏపీలోనైతే రోజుకు 4వేల‌కు పైగా పాజిటివ్ కేసులు వ‌స్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇక తెలంగాణ‌లోనైతే కేసుల లెక్క‌లంతా కిరికిరేన‌ని అంద‌రికీ తెలిసిందే. 

ఇక ఈ సంక్రాంతి మూడు రోజులు పండుగ పూర్తయ్యాక‌.. కేసుల సంఖ్య అమాంతం పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇలాంటి సంద‌ర్బంలో మ‌ళ్లీ విద్యాసంస్థ‌లు తెరిస్తే..?  క‌రోనాకు వెల్‌క‌మ్ చెప్పిన‌ట్టేగా? అస‌లే థ‌ర్డ్‌వేవ్‌లో పిల్ల‌ల‌పైనే ప్ర‌ధానం చూపిస్తోంది వైర‌స్‌. అందుకే, ఎందుకైనా మంచిద‌ని... సెల‌వులు మ‌రింత పొడిగించే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అని తెలుస్తోంది.

ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచి ఇచ్చేసింది. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా..17న విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు సెలవులను పొడిగించనున్నారని సమాచారం. సెలవులను పొడిగిస్తే మేలని వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వానికి సూచించనున్నట్లు తెలిసింది. 

ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ఇప్ప‌టికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని చెబుతున్నారు. ఎక్కువ రోజులు పొడిగిస్తే సర్కారు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకుంటే అటు ప్రత్యక్ష తరగతులు లేవు... ఇటు ఆన్‌లైన్‌ పాఠాలు లేవన్న విమర్శ వస్తుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెబుతున్నాయి. అటు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌కంటే ఎక్కువ‌ కేసులు వ‌స్తుండ‌టంతో.. ఏపీ ప్ర‌భుత్వం సైతం సెల‌వులు పెంచాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, అధికారులు చెబుతున్నా.. సెల‌వుల పెంపుపై సీఎం జ‌గ‌న్ మాత్రం విముఖంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న మొద‌టినుంచీ విద్యార్థులు-క‌రోనా విష‌యంలో ఇలానే మొండిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నార‌నే విమ‌ర్శ ఉంది. 

సెలవులు పొడిగిస్తారా? లేదా? అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? అక్కడే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటారు. లేదంటే, సోమ‌వారం ఉద‌యం ప్ర‌క‌టిస్తే విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఉసూరుమ‌నే అవ‌కాశం ఉందంటున్నారు. సెల‌వుల‌పై ఆదివారం నాటికి నిర్ణ‌యం తీసుకుంటే బెట‌ర్ అని సూచిస్తున్నారు.