TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిజాబ్ వివాదం తెలంగాణకు చేరిందా?

Published on: Thu Feb 10, 2022 6:13PM

కర్ణాటకలో ఓ పాఠశాలలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు ఆ రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. హైకోర్టు కూడా సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని గుర్తించినట్లు కనిపిస్తోంది. మరోవంక ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి..సమస్యను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. 

అయితే, సమస్య చల్లారక పొగ సరిహద్దులు దాటే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక పరిణామాలపై రాష్ట్ర స్థాయిని, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో వ్యాఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్ర మీడియా కూడా కర్ణాటక పరిణామాలపై ఫోకస్ పెట్టింది.   
ఈ నేపధ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హిజాబ్‌ వివాదం పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

కర్ణాటక పరిణామాలు తెలంగాణలోకి వ్యాపిస్తాయేమో అనే అనుమానం, ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. తాము కూడా హిందువులమే అయినా బీజేపీ కారణంగా జై శ్రీరాం అనలేక పోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓట్ల కోసం స్వార్థబుద్ధితో కర్ణాటకలో హింసను ప్రేరేపిస్తుందని ఆయన ఆరోపించారు. రెండు మతాలకు చెందిన విద్యార్థులు కొట్టుకునే స్థాయికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గొడవ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మొదలైతే.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి ప్రశ్నించారు. 

అదలా ఉంటే, తెలంగాణలోనూ హిజాబ్‌ వివాదం తలెత్తే ప్రమాదం ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హిజాబ్’కు అనుకూలంగా స్పందించారు. ఆయన తమదైన శైల్లో విద్యార్ధినులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అది ముస్లిమ్ల్ హక్కని పేర్కొన్నారు. మరోవంక హైదరాబాద్ లోనూ ముస్లిం విద్యార్థినులు హిజాబ్’కు అనుకూలంగా గొంతు విప్పుతున్నారు. హిజాబ్‌ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా ముస్లిం విద్యార్థినులు పేర్కొన్నారు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి పాఠశాలలు, కళాశాలకు రావడంపై  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిరసనలు మొదలయ్యాయి. సైదాబాద్‌లోని ఉజాలేషా దర్గాలో ముస్లిం మహిళలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చార్మినార్‌ సమీపంలోని యునానీ నిజామియా టిబ్బి కాలేజీ విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ పరిణామాలను గమనిస్తే, కర్ణాటక తర్వాత హిజాబ్ అగ్గి రాజుకునేది హైదరాబాద్ లోనే అనే అనుమానాలు వినవస్తున్నాయి.