అందుకే చెంప పగలగొట్టా.. ఆయన గుజరాత్ హిట్లరా?

 

సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి స్టేజ్‌పైకి వచ్చి హార్దిక్ పటేల్‌ ను చెంప చెల్లుమనేలా కొట్టాడు. ఆ తర్వాత ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే హార్దిక్‌ పటేల్‌ను కొట్టిన వ్యక్తి ఎవరు? ఎందుకు కొట్టాడు? అనే చర్చ మొదలైంది.

కాగా ఈ దాడి చేసిన వ్యక్తిని తరుణ్ గుజ్జర్ గా పోలీసులు గుర్తించారు. అయితే హార్దిక్ పటేల్‌పై చేసిన దాడిపై తరుణ్ గుజ్జర్ సందిస్తూ.. గుజరాత్‌లో పాటీదార్ ఉద్యమం ఉధృతంగా జరుగుతోన్న రోజుల్లో రాష్ట్రంలో బంద్ పరిస్థితులు నెలకొన్నాయని.. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే హార్దిక్ చెంప చెళ్లుమనిపించాలని నిర్ణయించుకున్నానని, ఇంతకాలానికి ఆ అవకాశం దొరికిందని తరుణ్ అన్నారు. అంతేకాదు.. హార్దిక్ తీసిన ర్యాలీ సందర్బంగా మందుల షాపులు సైతం మూసివేస్తారని, ఫలితంగా ఒకసారి తనకుమారుడి అనారోగ్యం పాలైనప్పుడు మందులు లభించక ఇబ్బందులు పడ్డామని తరుణ్ వాపోయారు. రాష్ట్రంలో ఆందోళలనలు, రాస్తారోకోలు చేయడం.. తనకు ఇష్టం వచ్చినప్పుడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాడని.. అసలు ఆయన ఎవరు? గుజరాత్ హిట్లరా? అంటూ సీరియస్‌గా ప్రశ్నించారు.