TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నోబెల్ విజేత నుంచి జ‌గ‌న‌న్న స‌ల‌హాలు స్వీక‌ర‌ణ‌!.. ఏపీ త‌ల‌రాత మారేనా?

Published on: Wed Mar 30, 2022 4:17PM

ఏపీలో సంక్షేమ క్యాలెండ‌ర్. నెల నెలా ఏదో ఒక ప‌థ‌కం పేరుతో డ‌బ్బులు. కోట్ల‌లో ల‌బ్దిదారులు. ఇంత చేస్తున్నా.. జ‌గ‌న‌న్న ఎన్ని గొప్ప‌లు చెప్పుకుంటున్నా.. ఒక్క‌రి బ‌తుకూ బాగుప‌డింది లేదు. ఒక్క కుటుంబ‌మూ ఆర్థికంగా నిల‌దొక్కుకున్న‌ది లేదు. కొత్త‌గా ఒక్క ఉద్యోగ‌మూ లేదు. క‌నీస ఉపాధి క‌ల్ప‌నా క‌రువు. ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌ట్లే. కంపెనీలు రావ‌ట్లే. అభివృద్ధి జాడేలే. వీటికి తోడుగా అన్నిట్లో ధ‌ర‌ల బాదుడు. ట్యాక్సుల‌తో వాత‌లు. మ‌ద్యం, ఇసుక లాంటి వాటితో పైసా వ‌సూల్‌. అప్పులైతే తెస్తున్నారు కానీ వాటిని తీర్చే ప‌రిస్థితి లేదు. సంక్షేమం పేరుతో ఓవైపు ప‌ప్పుబెల్లాలు.. ధ‌ర‌లు, ప‌న్నుల‌తో నిలువు దోపిడీ. అందుకే ఏపీలో సామాన్యుడి ప‌రిస్థితి అధోఃగ‌తి.

ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగానైనా గుర్తించిన‌ట్టున్నారు సీఎం జ‌గ‌న్‌. సంక్షేమానికి ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదంటూ, మ‌రి ప‌రిష్కారం ఏంటంటూ సందిగ్థంలో ప‌డ్డారు. 60 మందికి పైగా స‌ల‌హాదారులు ఉన్నా.. ఏం ఉప‌యోగం లేదంటూ నిరుత్సాహం. అంత‌లోనే ఆయ‌న‌కెవ‌రో మ‌రో స‌ల‌హాదారును సూచించారు. ఈసారి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ అడ్వైజ‌ర్‌ను ఆశ్ర‌యించారు జ‌గ‌న‌న్న‌. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన ఎస్తేర్ డఫ్లో సూచనలు, సలహాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించింది. 

భార‌త్‌కు చెందిన ప్ర‌ముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెన‌ర్జీ భార్య‌నే ఈ ఎస్తేర్ డ‌ఫ్లో. ఈమె భ‌ర్త‌తో, మ‌రొక‌రితో క‌లిసి 2019లో సంయుక్తంగా నోబెల్ బ‌హుమ‌తి పొందారు. పేదరికంపై అధ్య‌య‌నం చేయ‌డం ఈవిడ స్పెషాలిటీ. అమెరికాలోని మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఏపీ ప్ర‌భుత్వం రిక్వెస్ట్ మేర‌కు.. ఇటీవ‌ల ఎస్తేర్ డఫ్లో తాడేప‌ల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలపై చర్చ జరిగింది. అప్పులు తెచ్చి.. సంక్షేమ ప‌థ‌కాలు న‌డ‌ప‌డాన్ని ఎస్తేర్ త‌ప్పుబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వం రాంగ్ డైరెక్ష‌న్‌లో వెళుతోంద‌ని.. ఇలా అయితే ఏపీ దివాళా తీయ‌డం, పేద‌లు పేద‌లుగానే మిగిలిపోవ‌డం మిన‌హా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. మొత్తం స‌ర్కారు విధానాలే మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని ఎస్తేర్ సూచించార‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఆమె ఆధ్వ‌ర్యంలో.. ఏపీ సంక్షేమ ప‌థ‌కాల‌పై పూర్తి స్థాయిలో అధ్య‌యనం చేసి.. ప్ర‌భుత్వానికి స‌మ‌గ్ర నివేదిక‌ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి, నోబెల్ ప్రైజ్ విజేత‌ ఎస్తేర్ డఫ్లో అయినా.. ఏపీ త‌ల‌రాత‌ను మార్చ‌గ‌ల‌రో లేదో చూడాలి.