మహా పాదయాత్రకు ప్రభుత్వం బ్రేకులు? ఎలక్షన్ కోడ్ అడ్డంకి అవుతుందా?
Published on: Thu Nov 11, 2021 10:16AM
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా మహా పాదయాత్రకు మహా మద్దతు లభిస్తోంది. పాదయాత్ర ఏ ప్రాంతానికి చేరితే ఆ ప్రాంత మహిళలు, రైతులు, స్థానికులు.. ఇలా అన్నివర్గాల ప్రజలు అమరావతికి మద్దతుగా పాదయాత్రకి సంఘీభావం పలుకుతున్నారు. పాదయాత్ర చేస్తున్న వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నారు. మహా పాదయాత్రకు జనం వెల్లువ చూసి.. జగన్ సర్కారులో ఆందోళన పెరుగుతోంది. అనేక జిల్లాల మీదుగా సాగే పాదయాత్రతో అమరావతి నినాదం ఊరూరా మారుమోగుతుందని భయపడుతున్నట్టుంది. అందుకే కాబోలు.. యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచీ ఎలా ఆపాలా అనే దిశగానే అనేక కొర్రీలు పెడుతోంది సర్కారు. తాజాగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడంతో.. మహా పాదయాత్ర సందిగ్థంలో పడింది. అయితే, ఎన్నికల కోడ్.. పాదయాత్రకు వర్తించదంటోంది టీడీపీ.
హైకోర్టు అనుమతితో రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర.. రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రైతులను అడుగడుగున అడ్డుకోవటం, సంఘీబావం ప్రకటిస్తున్న వారిని అక్రమ అరెస్టులు చేయటమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. హైకోర్టు అనుమతి ఉన్న ఈ పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని చెప్పారు.
మరోవైపు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి రాజధాని రైతుల మహాపాదయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. పాదయాత్రకు రాజధాని రైతులను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. పాదయాత్ర ఆసాంతం పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్ బలగాల మధ్యే పాదయాత్ర కొనసాగుతోంది.


