భారీగా తగ్గుతున్న కేసులు!.. కరోనా ఖతమేనా?
Published on: Mon Jan 31, 2022 10:52AM
ఓవైపు కొవిడ్ కేసులు భారీగా ఉన్నాయి. చుట్టుపక్కల అందరినీ కరోనా కాటేస్తోంది. కాకపోతే, గుడ్డిలో మెల్లలా ఓ గుడ్న్యూస్. కొత్త కేసుల నమోదు సంఖ్య బాగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా 3 లక్షల లోపు నమోదవుతోన్న కేసులు.. తాజాగా 2 లక్షలకు దిగొచ్చాయి. అయితే, కేసుల సంఖ్య తగ్గడం వెనుక ఓ తిరకాసు ఉంది. ఆదివారం కొవిడ్ టెస్టుల సంఖ్య తగ్గడమే.. కేసుల తగ్గుదలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, పాజిటివిటీ రేటు మాత్రం14.5 శాతం నుంచి 15.77 శాతానికి పెరిగడం కలవరానికి గురి చేస్తోంది.
ఆదివారం 13 లక్షల మందికి కరోనా నిర్ధరాణ పరీక్షలు చేయగా.. 2,09,918 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 24 గంటల వ్యవధిలో 959 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళలోనే 51 వేల కేసులు.. 475 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో 68, మహారాష్ట్రలో 50 మంది మరణించారు.
ఆదివారం 2,62,628 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 18,31,268కి తగ్గాయి. క్రియాశీల రేటు 4.43 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 94.37 శాతానికి పెరిగింది.


