ఒక పరాజయం 100 తప్పులు.. పుష్కరాల 'అతి' ఈ 'గతి' కి కారణమా?

 

పుష్కరాల 'అతి' టీడీపీకి ఈ 'గతి' పట్టడానికి ఓ కారణమా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణ, గోదావరి రెండు పుష్కరాలు వచ్చాయి. భక్తితో చేయాల్సిన పుష్కరాలను వేల కోట్లు ఖర్చు పెట్టి భారీగా చేసి.. విమర్శలు పాలయ్యారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రాజధాని లేదు, ప్రాజెక్ట్ లు నిర్మాణం జరగాలి, లోటు బడ్జెట్. ఇవన్నీ తెలిసి కూడా దశాబ్దాల అనుభవమున్న బాబు.. పుష్కరాల పేరుతో వేలకోట్లు వృథా చేసారు. పోనీ అంత ఖర్చు పెట్టి పుష్కారాల ఏర్పాట్లు అయినా సరిగ్గా చేసారా అంటే అదీ లేదు. విపరీతమైన ప్రచారం చేసుకున్నారు కానీ, పుష్కర ఘాట్లు సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారు. అప్పటికప్పుడు నామినేషన్ల పద్దతిలో టెండర్లు ఇచ్చారు. వారు డబ్బులు తిని అరకొర ఏర్పాట్లు చేసారు. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వీటికితోడు పుష్కారాలను సినీ దర్శకుడితో షూట్ చేపించారు. అలాంటి వాటి వల్ల ప్రజాధనం వృధా అయింది కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు.

అంతేకాదు, పుష్కారాల సమయంలో దివ్యమైన ముహూర్తం అంటూ ఒక సమయాన్ని ప్రచారం చేసారు. దీంతో ప్రజలందరూ అదే సమయంలో పుష్కర స్నానం చేయడానికి ఉత్సాహం చూపించారు. చివరికి సీఎం గా ఉన్న బాబు కూడా.. సకుటుంబ సమేతంగా అదే సమయానికి పుష్కర స్నానం చేసారు. ఆ ముహూర్తం పుణ్యమా అని తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారంటూ టీడీపీ ప్రభుత్వం మీద అప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా పుష్కరాల పేరుతో ఓ వైపు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా, మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. దీంతో టీడీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత ఓటమికి దారి తీసింది.