TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ల‌రా?

Published on: Sat Feb 26, 2022 4:21PM

చంద్ర‌బాబు నిండు స‌భ‌లో శ‌ప‌థం చేశారు. న్యాయం జ‌రిగే వ‌ర‌కూ కౌర‌వ స‌భ‌గా మారిన ఈ అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోన‌ని ఆనాడు ప్ర‌తిజ్ఞ చేశారు. ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటాన‌ని.. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడ‌తాన‌ని చంద్రబాబు ప్ర‌క‌టించారు. భార్య భువ‌నేశ్వ‌రిపై స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడ‌టంపై ఆయ‌న ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీ బ‌య‌ట బోరున విల‌పించారు. చిన్న‌పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. 

క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ సెష‌న్ జ‌ర‌గ‌నుంది. ఆ రోజు చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి.. అసెంబ్లీని బ‌హిష్క‌రించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత.. మ‌ళ్లీ ఇప్పుడే స‌భ స‌మావేశం కానుంది. మ‌రి, ఈసారి హౌజ్‌కు ప్ర‌తిప‌క్ష నేత వ‌స్తారా?  చేసిన శ‌ప‌థానికి క‌ట్టుబ‌డి ఉండి.. స‌భ‌కు గౌర్హాజ‌రు అవుతారా? అనే ఆస‌క్తి నెల‌కొంది. 

త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే దానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు బాటలోనే తాముకూడా అసెంబ్లీకి వెళ్లబోమని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అయితే, అందుకు పార్టీ అధినేత అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని ఎమ్మెల్యేల‌కు చంద్రబాబు సూచిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా.. ఆయన తరపున పార్టీ అసెంబ్లీలో పోరాడిందని చంద్రబాబు గుర్తుచేస్తున్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని ఎమ్మెల్యేలు అంటున్నారు. సభకు వెళ్లినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, పైగా కెమెరాల్లో తమను చూపించడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు చెబుతున్నారు. 

ఇప్పటికే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ కట్ చేయాలని సూచించింది. ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం లేదని టీడీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ప‌లువురు ఎమ్మెల్యేలు.. చంద్రబాబు ద‌గ్గ‌ర‌ ప్రస్తావించగా.. 5 నుంచి 10 మంది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడిన విషయాన్ని అధినేత గుర్తుచేశారు. 

ఇలా.. అసెంబ్లీకి హాజ‌ర‌వ‌డంపై టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మార్చి తొలివారంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. చంద్ర‌బాబు మాత్రం హాజ‌రుకాబోర‌ని తెలుస్తోంది. మ‌రి, మిగ‌తా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం చంద్ర‌బాబు బాట‌లోనే అసెంబ్లీని బ‌య్‌కాట్ చేస్తారా? లేదంటే, అధినేత లేకుండానే స‌భ‌కు హాజ‌రై.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గొంతెత్తుతారా? అనేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.