బండి సంజయ్‌పై జైల్లో విషప్రయోగం?.. తెలంగాణలో కలకలం!
Published on: Mon Jan 3, 2022 5:35PM
విధి బహు విచిత్రం. అటూ-ఇటూ-ఎటో మలుపు తిరిగి.. ఎక్కడికో దారి తీసేలా చేస్తుంది. రాజకీయమూ అంతే. అందుకు, బండి సంజయ్ ఎపిసోడే ఎగ్జాంపుల్. జీవో 317 సవరణ కోసం ఆదివారం రాత్రి కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్షకు కూర్చొన్నారు. పోలీసులు వచ్చారు. గేట్లు బద్దలు కొట్టారు. అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ పడింది. బెయిల్ తిరష్కరణకు గురైంది. కట్ చేస్తే.. సోమవారం రాత్రికల్లా.. బండి సంజయ్ జైల్లో ఉన్నారు. 24 గంటల్లో ఎంతటి కీలక పరిణామం. అదే రాజకీయమంటే.
ఇక, జైల్లో బండి సంజయ్ ప్రాణాలకు హాని పొంచిఉందని ఆయన తరఫు లాయర్లు ఆరోపించారు. ఆ మేరకు కోర్టులో కీలక వాదనలు జరిగాయి. బండి సంజయ్‌పై జైలులో విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని లాయర్లు కోర్టుకు వెల్లడించారు. న్యాయవాదుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. బండి సంజయ్‌కు అందించే ఆహారాన్ని జైలర్ రుచి చూశాకే ఆయనకు ఇవ్వాలని ఆదేశించడం కీలక పరిణామం. బండి సంజయ్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందనే అనుమానాలతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జైల్లో ఏదైనా హాని జరిగితే అందుకు కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు.
కోర్టులో లాయర్లు సంజయ్ తరఫున బలంగా వాదించారు. బండి సంజయ్ గాయపడ్డారని.. ఎవరు గాయపరిచింది సరిగ్గా తెలియదని.. 353 కాకుండా 333 కింద నోటీస్ ఇవ్వకుండా కోర్టుకు తీసుకువచ్చారని లాయర్లు ఆరోపించారు. కావాలనే సెషన్స్ కోర్టుకు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు తీసుకువచ్చారని.. అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయే కొట్టినట్టు కేసు పెట్టడం దారుణమన్నారు. సంజయ్ ఎవరిని కొట్టారో ఎటువంటి రుజువు లేదని.. పోలీసులు కావాలనే నోటీసులు ఇవ్వకుండా కేసు పెట్టారని.. ఇది ప్రభుత్వం దుర్మార్గపు చర్య లాయర్లు ఆరోపించారు. మంగళవారం హైకోర్టులో మరోసారి బెయిల్ పిటీషన్ వేస్తామని చెప్పారు.


