వైసీపీ ఎంపీకి సీబీఐ నోటీసులు! వివేకా కేసులో నెక్స్ట్ ఎవరో..?
Published on: Thu Dec 23, 2021 11:33AM
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చిక్కుల్లో పడబోతున్నారా? ఆయనకు ఉచ్చు బిగిస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే ఆయనను ప్రశ్నించబోతుందనే ప్రచారం జరుగుతోంది. సీబీఐ నోటీసులపై ఎంపీ కార్యాలయం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్యలో మొదటి నుంచి ఎంపీ అవినిష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. వివేకా కుటుంబ సభ్యులు కూడా ఆయనపై అనుమానాలు వ్యక్తం చేశారు. విపక్షాలు కూడా వివేకా హత్య కేసులో కడప ఎంపీని ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమైందని తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో ఆయనను ప్రశ్నించడానికి లోక్ సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత.. ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనచురుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ పైనా, వైఎస్ వివేకా కుమార్తె పైనా ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కేసును ముందుకు తీసుకెళ్లకుండా ఒత్తిడి చేసే వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కొద్ది రోజులు విచారణ నిలిపివేసి ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చి ఇప్పుడు నేరుగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో.. ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.


