రాజధాని మార్పు.. దొనకొండ భూముల రేట్లకు రెక్కలు, పోటీ పడుతున్న నేతలు!!

 

ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ నేతలు అలాంటిదేం లేదని ఖండిస్తున్నారు. కానీ తాజాగా వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. జగన్ సర్కార్ కి రాజధానిని మార్చే ఆలోచన ఉందా అని సామాన్య ప్రజలకు సైతం అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.

తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఏపీ కొత్త రాజధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పుడు దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడానికి బడా నేతల నుంచి చోటా నేతల వరకు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కొద్ది రోజుల్లో ఇది కోట్లలోకి చేరుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం.. రాజధానిగా అమరావతి అనుకూలం కాదని బొత్స చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఈజీగా వ్యాఖ్యలు చేయరని, పరిస్థితి చూస్తుంటే సీఎం జగన్‌ త్వరలోనే దొనకొండను రాజధానిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దొనకొండ పేరు హోరెత్తుతుండడంతో చుట్టుపక్కల బడా బాబులు అక్కడి భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు అధికార పార్టీ నేతలు ఇప్పటికే అక్కడ పెద్ద మొత్తంలో భూములు కొని ఉంచారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఏపీ రాజధాని నిజంగానే మారనుందా? లేక ఇదంతా ప్రచారానికే పరిమితం కానుందా? అని జగనే తేల్చాలి.