పైరవీకారులకే మంచి పోస్టింగ్! ఉద్యోగుల ప్రమోషన్లలో అక్రమాలు 

తెలంగాణలో చాలా కాలం తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తున్నాయి. ఇందుకోసం ఎంతో కాలం పోరాడారు ఉద్యోగులు. ఇటీవల రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ చేశారు కేసీఆర్. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో  జనవరి తొలి వారం నుంచి రాష్ట్రంలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదరుచూస్తున్న కొందరు ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల అస్తవ్యస్థ విధానాలతో అవకతవకలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కొందరు పైరవీలతో మంచి పోస్టింగులు సాధిస్తుండగా.. సీనియర్లకు కూడా కొందరికి కోరుకున్న చోటు దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్రమోషన్లు పొందడానికి ఇంతకు ముందు మూడేళ్ల సర్వీసు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం దాన్ని రెండేళ్లకు తగ్గించడంతో ఎక్కువ మందికి ప్రమోషన్లు దక్కుతున్నాయి. దీంతో అవినీతికి భారీగా ఆస్కారం తలెత్తిందనే వాదనలున్నాయి.  చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు దక్కడం లేదు. తాత్కాలిక ప్రమోషన్లను కారణంగా చూపి.. శాశ్వత ప్రమోషన్లను నిలిపేశారు. దీంతో ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ఉన్నతాధికారులు, మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దీంతో పైరవీలు చేసుకోకుండా నిజాయిగా ఉండే ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. 

ప్రమోషన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం సీఎంవోకు చేరిందని తెలుస్తోంది. అందుకే రెండు రోజుల క్రితం సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారట. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా ఆయనే ఫోన్లు చేసి మాట్లాడారు. శాఖల వారీగా ప్రమోషన్లకు అర్హులైన ఉద్యోగుల జాబితా తెప్పించుకున్న సీఎం.. ఇప్పటికే ప్రమోషన్లు పొందిన, పదోన్నతికి అర్హత ఉన్న పలువురు ఉద్యోగులకు స్వయంగా ఫోన్లు చేశారు.ప్రమోషన్ల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా..? డబ్బులు తీసుకుంటున్నారా..? ఇతరత్రా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని ఆయన ఆరా తీశారు.  సీఎం నేరుగా ఫోన్ చేయడంతో కొందరు తమ అనుభవాలను ఆయనకు వివరించారని తెలుస్తోంది. సీనియర్ల ఆగడాలు, డబ్బులు తీసుకోవడం, పైరవీల గురించి కొందరు ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తున్నారని తెలిసినా కూడా కొందరు ఉన్నతాధికారుల తీరు మారడం లేదంటున్నారు. తమ అనుకున్న వారికి, ఇతరత్రా కారణాలతో ఇష్టమెచ్చినట్లుగా పోస్టింగులు ఇస్తున్నారని చెబుతున్నారు. కౌన్సిలింగ్  ద్వారా ప్రమోషన్ల ప్రక్రియ చేపడితే ఇలాంటి అవతకవకలకు అవకాశం ఉండేది కాదనే చర్చ ఉద్యోగుల నుంచి వస్తోంది. దీంతో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయ్యాక.. ఈ ప్రక్రియలో ఎదురైన అవాంతరాలు.. పదోన్నతుల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా సీఎం సేకరించనున్నారని సమాచారం.