ఈమెను చూసి స్పూర్తి పొందండి నేతలు..!

 

సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు పలు సందర్భాల్లో దీక్షలు చేసే ఉంటారు. అయితే ఏదో సాయంత్రం మొదలు పెట్టేసి సాయంత్రానికి దీక్ష విరమించేవారు కొంత మంది ఉంటే.. ఆమరణ దీక్ష పేరుతో ఒకటి రెండు రోజులు.. మా అయితే ఓ పది రోజులు దీక్ష చేపట్టి.. ఆతరువాత ప్రభుత్వ పెద్దలు ఏవో మాటలు చెప్పి.. అవి జరగవని తెలిసినా.. వాటికి ఒప్పుకుంటూ దీక్ష విరమిస్తారు. అయితే ఇదంతా ఒక కేటగిరికి చెందిన నేతల సంగతి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారేళ్ల నుండి దీక్ష చేపడుతూ ఉక్క మహిళగా పేరు పొందారు ఇరోమ్ షర్మిల.

 

మణిపూర్ ఉక్కు మహిళ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఇరోమ్ షర్మిల. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ ఆమె 16 ఏళ్ల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంఫాల్‌ విమానాశ్రయం సమీపంలోని ఓ బస్టాప్ వద్ద అసోం రైఫిల్స్‌ సైనికులు పదిమంది పౌరులను దారుణంగా ఊచకోత కోసింది. దీనికి నిసనగా ఆమె 2000 సంవత్సరం నవంబర్ రెండో తేదీన దీక్షను మొదలుపెట్టగా.. గత పద్నాలుగేళ్లుగా షర్మిల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ముక్కుకు వేలాడుతున్న ఫ్లూయిడ్స్ పైపుతో దీక్షలోనే ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఆమె ఇన్ని సంవత్సరాల నుండి దీక్ష చేస్తున్నా కానీ.. ఎంత మంది అధికారంలోకి వచ్చినా కానీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడం. దీంతో ఆమె కూడా దీక్ష విరమించాలని నిర్ణయింకుంది. వచ్చే నెల 9వ తేదీన ఆమె దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు ఆమె రాజకీయ ఆరంగేట్రానికి మణిపూర్ యువత నుండి మంచి స్పందనే లభించింది. మరి ఏదో నామ్ కే వాస్త్ ఓ రెండు రోజులు దీక్ష చేసేసి.. ఏదో సాధించాం అనే నేతలు ఇరోమ్ షర్మిలను చూసి స్పూర్తి పొందాల్సిన అవసరం ఉంది.