ప్రతీకారదాడులు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
Published on: Wed May 27, 2026 11:01AM

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్లు పీక్స్ కు చేరుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి అబోల్ఫజల్ షేకర్చి అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
గత కొన్ని వారాలుగా అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్‌కు చెందిన లారక్ ద్వీపానికి దక్షిణంగా అమెరికా , ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు జరిపాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
ఈ దాడులలో పలువురు ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యను అమెరికా ఆత్మరక్షణ దాడులు గా అభివర్ణించగా.. ఇరాన్ మాత్రం దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంది. అమెరికా వైఖరి వల్ల శాంతి చర్చలకు తీవ్ర విఘాతం కలిగిందని ఇరాన్ ఆరోపించింది.


