కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి.. ఒక ఇండియన్ మృతి
Published on: Thu Jun 4, 2026 8:37AM
.webp)
గల్ఫ్ లో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మిడిల్ ఈస్ట్ మారిపోయింది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడి గల్ఫ్ రీజియన్‌లో కలకలం రేపింది. ఈ భీకర దాడిలో ఒక ఇండియన్ సిటిజన్ మరణించాడు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే కువైట్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 లక్ష్యంగా ఇరాన్ ఈ దాడికి తెగబడింది. క్షిపణులు దూసుకువచ్చి పేలడంతో ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలతో, దట్టమైన పొగలతో రణరంగంగా మారిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో ఒక్కరు మరణించడమే కాకుండా, 63 మంది ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన కువైట్ అత్యవసర విభాగాలు తక్షణమే స్పందించాయి. సంఘటనా స్థలానికి అంబులెన్సులు హుటాహుటిన చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. బాధితులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ దాడిలో ఇండియన్ సిజిజన్ మరణించిన విషయాన్ని కువైట్‌లోని భారత ఎంబసీ అధికారికంగా ధృవీకరించింది. ఆ భారతీయుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించింది. మృతుడి పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కువైట్ ఉన్నతాధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. తమ దేశంలోని అత్యంత కీలకమైన పౌర సదుపాయాలపై జరిగిన ఈ క్షిపణి దాడిని కువైట్ విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ఖండించింది. కాగా ఈ దాడితో ప్రయాణికుల భద్రతను దృష్ట్యా కువైట్ ప్రభుత్వం జూన్ 4 వరకు విమాన రాకపోకలన్నింటినీ రద్దు చేసింది.


