చనిపోయిన తండ్రిని ఆయుర్వేదంతో బ్రతికించిన ఐపీఎస్‌!!

 

అనారోగ్యంతో మృతి చెందిన తన తండ్రికి నెలరోజులుగా ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర కుమార్‌ మిశ్రా 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన తండ్రి కేఎమ్‌ మిశ్రా (84)కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఉంది. ఆయనను జనవరి 13న బన్సాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆ ఆస్పత్రి రికార్డుల ప్రకారం.. జనవరి 14న సాయంత్రం ఆయన మృతి చెందారు. దీంతో తన తండ్రి మృతదేహాన్ని రాజేంద్ర కుమార్.. ‘74 బంగ్లాస్’‌ ప్రాంతంలోని తన నివాసానికి తీసుకెళ్లాడు. అక్కడ తన తండ్రి మృతదేహానికి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నారు. నెల రోజులపాటు రహస్యంగా ఉన్న ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది.

ఇటీవల మిశ్రా నివాసం వద్ద ఎస్‌ఏఎఫ్‌ కు చెందిన కానిస్టేబుళ్లు విధులు నిర్వహించడానికి వచ్చారు. దీంతో వారికి ఈ విషయం తెలియడంతో మీడియాకు సమాచారం చేరింది. ఈ ఘటనపై రాజేంద్ర కుమార్‌ ను మీడియా ప్రశ్నించగా.. ఆయుర్వేద చికిత్సకు తన తండ్రి స్పందిస్తున్నారని చెప్పి పెద్ద బాంబు పేల్చారు. దీంతో నెలరోజుల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు స్పందించడం ఏంటంటూ షాక్ తిన్న మీడియా ఆయన తండ్రిని చూపించాలని కోరింది. కానీ తండ్రిని చూపించేందుకు రాజేంద్ర కుమార్ నిరాకరించారు. ఇక ఆస్పత్రి జారీచేసిన డెత్ సర్టిఫికెట్‌పై తానేమీ మాట్లాడదలచుకోలేదని వెల్లడించారు. బస్సాల్‌ ఆస్పత్రి ప్రతినిధి లోకేశ్‌ ఝా ఈ విషయంపై మాట్లాడుతూ... ‘కేఎమ్‌ మిశ్రాను జనవరి 13న ఆస్పత్రిలో చేర్పించగా అశ్విని మల్హోత్రా అనే వైద్యుడు చికిత్స అందించారు. ఆయన జనవరి 14న మృతి చెందారు. ఈ మృతిపై డెత్ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించాము’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటన సంచలనంగా మారింది. ఆయుర్వేద చికిత్సకు తన తండ్రి స్పందిస్తున్నారని ఆ ఐపీఎస్ అబద్దం చెప్పారో లేక డాక్టర్లు పొరబడ్డారో తెలియాల్సి ఉంది.