TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీజీపీగా శ్రీ హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ

Published on: Sun Jun 1, 2025 6:54AM

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు.   మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన రాష్ట్ర పోలీస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.    1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా  విజిలెన్స్అండ్ ఎన్ ఫోర్స్ మెంట్  విభాగం డైరెక్టర్  జనరల్  పోస్టులో కొనసాగుతూ ఇంత వరకూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.

పదవీ  విరమణ తేదీతో సంబంధం లేకుండా డీజీపీగా ఆయన  రెండేళ్లపాటు   కొనసాగనున్నారు. గత నాలుగు నెలలుగా ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు. ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపిగా పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇన్ ఛార్జిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.  డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి  శుభాకాంక్షలు తెలిపారు.

గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా నియమించింది. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పని చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం హరీష్ కుమార్ గుప్తాకు ఇన్ చార్జ్ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తి స్థాయి డీజీపీగా నియమించింది.