TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హమ్మయ్య అమలాపురానికి ఇంటర్నెట్ మళ్లీ వచ్చేసింది!

Published on: Fri Jun 3, 2022 4:53PM

హమయ్య కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో దాదాపు పది రోజుల తరువాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఇప్పటికీ ఇంకా జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. జిల్లా పేరు మార్పు వ్యవహారంతో కోనసీమలో కాక పుట్టింది. పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళన కారుల ఉద్యమం గత నెల 24న ఒక్క సారిగా అదుపు తప్పింది. మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాన్ని ఆందోళన కారులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే సతీష్ నివాసాన్ని ధ్వంసం చేశారు. అమలాపురం పట్టణంలో విధ్వంస కాండ వెనుక అధికార వైసీపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అల్లర్ల వెనుక తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రమేయం ఉందని అధికార పార్టీ ఆరోపణలు గుప్పించినప్పటికీ ఈ అల్లర్ల కేసులకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీకి చెందిన వారే కావడంతో అధికార పార్టీ ఆరోపణలను ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. పైగా 144వ సెక్షన్ అమలులో ఉన్నా వేల మంది రోడ్లపై స్వైర విహారం చేస్తూ ఏకంగా మంత్రి ఇంటిని దగ్ధం చేసి, ఎమ్మెల్యే నివాసాన్ని ధ్వంసం చేశారంటే శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అల్లర్లు ఆపడంలో పూర్తిగా విఫలమైన పోలీసులు, జిల్లా యంత్రాంగం.. ఇంటర్నెట్ సేవలను ఆపడంలో  మాత్రం మహా ఉత్సాహం చూపారు. అల్లర్లు అదుపులోనికి వచ్చిన తరువాత కూడా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించకుండా రోజుల తరబడి బ్యాన్ ను కొనసాగించి జనాలను ఇబ్బంది పెట్టారు, పెడుతున్నారు. పది రోజుల తరువాత కూడా ఇంకా జిల్లాలోని ఎనిమిది మండలాలకు అంతర్జాల సేవలు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం కోనసీమలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అల్లర్లకు సంబంధించి 91 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అల్లర్లకు వెనుకా ముందూ ఎవరెవరున్నారన్నది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నా కోనసీమ వాసులందరికీ అర్ధమైపోయింది. కానీ పోలీసులకు మాత్రం ఇంకా అల్లర్లు జరుగుతాయన్న సమాచారమే అందుతోంది. అందుకే అల్లర్ల సమాచార వ్యాప్తి నిరోధం అంటూ రోజులకు రోజులు అంతర్జాలం జనాలకు అందకుండా ఆపుతున్నారు. వాస్తవానికి కాశ్మీర్ లో కూడా ఇన్నేసి రోజులు ఇంటర్నెట్ ను ఎప్పడూ నిలిపివేయలేదని పరిశీలకులు అంటున్నారు. అల్లర్ల నిరోధంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కోనసీమలో ఉద్రిక్తతలు చల్లారలేదు. అంతర్జాలాన్ని ఆపేసి అల్లర్లు మరింతగా వ్యాపించకుండా నిరోధించగలిగామని చెప్పుకోవడానికి.. ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా నిరవధికంగా అంతర్జాల సేవలు అందుబాటులో లేకుండా చేస్తున్నారని కోనసీమ వాసులు విమర్శిస్తున్నారు.