ఆడవాళ్లని ఏడిపించడం ఓ సరదా!

ఆడవాళ్లు అర్ధరాత్రి నిర్భయంగా తిరగడం గురించి గాంధీగారు అన్నమాటలూ, స్త్రీ స్వేచ్ఛ గురించి మనం చెప్పుకొనే కబుర్లు అన్నీ అలాగే వినిపిస్తున్నాయి. కానీ వాస్తవాలు మరోలా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి మాటేమోగానీ, మిట్టమధ్యాహ్నం నడివీధిలో సైతం ఆడవాళ్లకి వేధింపులు తప్పడం లేదు. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు ఐక్యరాజ్యసమితి ఒక సర్వేని చేపట్టింది. International Men and Gender Equality Survey (IMAGES) పేరుతో చేపట్టిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.

 

వేధించి వదలిపెట్టారు:

పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలోని లెబనాన్‌, ఈజిప్ట్‌, మొరాకో, పాలస్తీనా వంటి దేశాలలో ఈ సర్వేని చేపట్టారు. అసభ్యకరమైన కామెంట్లు చేయడం, వెంటపడటం, వేధించడం, అదేపనిగా తినేసేలా చూడటం... లాంటి చేష్టలతో బయట తిరిగే ఆడవారు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో గమనించే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రతిదేశం నుంచీ సిగ్గుపడే వాస్తవాలు బయటపడ్డాయి. ఈజిప్టునే తీసుకుంటే- తమ జీవితకాలంలో ఏదో ఒక స్థాయిలో ఆడవాళ్లని ఏడిపించామంటూ 64 శాతం మంది మగవారు ఒప్పుకున్నారు.

 

సరదా కోసమే!

మిగతాదేశాలలోకంటే మొరాకోలా తక్కువగా... ఓ 33 శాతం మందే తాము ఆడవాళ్లని ఏడిపించామంటూ ఒప్పుకున్నారు. అంటే తక్కువలో తక్కువగా కనీసం మూడోవంతు మంది మగవారైనా ఆడవాళ్లని ఏడిపించే ఉంటారన్నమాట! ‘ఇంతకీ మీరు ఆడవాళ్లని ఎందుకు ఏడిపిస్తారు?’ అని అడిగిన ప్రశ్నకి చాలా చిత్రమైన సమాధానం వినిపించింది. 90 శాతం మంది మగవారు తాము కేవలం సరదా (fun) కోసమే ఆడవాళ్లని ఏడిపించామని ఒప్పుకున్నారు.

 

బాధితురాలిదే తప్పు:

ఎవరన్నా తమని ఏడిపించారంటూ ఆడవాళ్లు బాధపడితే... నేరస్తుడిని వదిలిపెట్టి, ఆడవాళ్లదే తప్పు అన్నట్లుగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. విచిత్రమేమిటంటే- సాటి ఆడవాళ్లు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారట! ‘రెచ్చగొట్టే బట్టలు వేసుకున్న ఆడవాళ్లని వేధించడం సహజమే!’ అని 84 శాతం మంది ఆడవాళ్లు భావిస్తున్నారట. ఇక ‘రాత్రిపూట బయటకివచ్చే ఆడవాళ్లు వేధింపులని ఆహ్వానించినట్లే!’ అని 43 శాతం మంది అభిప్రాయంగా ఉంది.

 


చదువు ఎక్కువైతే సంస్కారం తగ్గుతోంది:

చదువు- సంస్కారం అని అంటూ ఉంటాము. కానీ నిరక్షరాస్యులకంటే చదువుకున్నవారే ఆడవాళ్లని ఏడిపించడంలో ముందుంటున్నారట. అంతేకాదు! చదువుకున్న ఆడవాళ్లే ఎక్కువగా వేధింపులకి గురవుతున్నట్లు తేలింది.
సర్వేలో తేలిన విషయాలు చూసిన ఐక్యరాజ్యసమితి, ఇలాంటి వేధింపులు తగ్గేందుకు కొన్ని చర్యలను సూచించింది. వాటి

 

‘సమాజాన్ని ప్రభావితం చేసే మీడియా వంటి రంగాల ద్వారా స్త్రీల పట్ల ఉన్న చులకన భావాన్ని తగ్గించాలి’ అన్నది ఓ ముఖ్యమైన సూచన. హుమ్‌! అది సాధ్యమేనంటారా?      

 

 - నిర్జర.