నేడు ప్రపంచ (అ)శాంతి దినం...


సెప్టెంబర్ 21... ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్! వాడుక భాషలో చెప్పుకుంటే వాల్డ్ పీస్ డే! అంటే... ప్రపంచ శాంతి దినం అన్నమాట! సంవత్సరం పొడవునా వచ్చే అనేక అనసవర దినాల కంటే ఇది చాలా ముఖ్యమైందనే చెప్పుకోవాలి. అయినా ఇప్పుడున్న అరాచక హింసాయుత ప్రపంచంలో శాంతి కోసం ఒక రోజు కేటాయించుకోవటం సబబు కూడా!

ప్రపంచ శాంతి దినోత్సవం 1982లో మొదలైంది. దీన్ని ఐక్యరాజ్య సమితే స్వయంగా ప్రకటించి జరుపుతూ వస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో అంశంతో ప్రపంచ శాంతిని ఎలా నెలకొల్పవచ్చో సమాలోచనలు చేస్తుంటారు. యూఎన్ ఓలోని సభ్య దేశాలన్నీ ఈ రోజు రకరకాల కార్యక్రమాలు చేపడతాయి. ఇండియా కూడా ఈ ఇంటర్నేషనల్ పీస్ డే వేడుకల్లో పాల్గొంటూనే వుంది.

ప్రపంచ శాంతి దినోత్సవం నాడు భూమ్మీద ఎక్కడా యుద్ధం లేకుండా చూడటం ఒక లక్ష్యంగా కొనసాగుతూ వస్తోంది. కనీసం ఈ ఒక్క రోజన్నా హింస, ప్రాణ నష్టం వుండకుండా చర్యలు తీసుకుంటూ వుంటారు. అయితే, ఐఎస్ఐఎస్, బోకో హరామ్ లాంటి రాక్షస మూకల చేతుల్లో శాంతి ధ్వంసమవుతోన్న తరుణంలో ఎక్కడ ఎప్పుడు బాంబులు పేలుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి... 

ఇండియా విషయానికి వస్తే ప్రపంచ శాంతిలో మన వంతు కృషి ఎంతో వుంది. పైగా మనం సగర్వంగా చెప్పుకోగల సత్యం... గత రెండు వేల ఏళ్లలో భారతీయులు ఏనాడూ మరో దేశంపైకి దండత్తలేదు. విషాదంగా ఎన్నో విదేశీ శక్తులు ఇండియా పైకే దండెత్తి వచ్చాయి. హింస, నష్టం కలిగిస్తూ వేయేళ్ల బానిసత్వం మన మీద రుద్దాయి. స్వాతంత్ర్యం తరువాత కూడా ఆదునిక భారతదేశం తనకు తాను దండెత్తలేదు. పాక్ తో మూడు సార్లు యుద్ధం జరిగినా అన్నీ దాయాది తప్పిదాల వల్లే జరిగాయి. చైనాతోనూ అనివార్య పరిస్థితుల్లోనే యుద్ధం సంభవించింది... 

ఇండియా ఇతరులపై యుద్ధం చేయకున్నా ఉగ్రవాదం రూపంలో మనకు ఎంతో అమానుషం ఎదురవుతోంది. కాశ్మీర్ కారణంగా పాక్ మన మీద పగ పెంచుకుంటూ వరుస దాడులకు పాల్పడుతూనే వుంది. నిన్నగాక మొన్న యూరీలో మన సైనికుల్ని పొట్టన బెట్టుకున్నారు పాకీ ఉగ్రవాదులు. అయినా మనం పూర్తి స్తాయి యుద్ధం చేసే సూచనలు కనిపించటం లేదు. అది ఆర్దిక కారణాలు, ప్రాణ నష్టం దృష్ట్యా కూడా అంత మంచిది కాదు. అయితే, అన్నిటికంటే ముందు ఇండియా యుద్దంలోకి దిగటం ప్రపంచ శాంతికి తీవ్రమైన భంగమే. అందుకే మోదీ ఇంకా సంయమనం పాటిస్తున్నారు... 

ఇండియా పాకిస్తాన్ మద్య వివాదం, ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య గొడవ, ఉత్తర, దక్షిణ కొరియాల మద్య కయ్యం.... ఇలాంటివన్నీ ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నవే. దానికి తోడు ఉన్మాదంతో ఊగిపోతోన్న ఉగ్రవాద మూకలు అన్ని దేశాల్నీ యుద్ధం అంచున నిలబెడుతున్నాయి. ఇంత కాలం ముస్లిమేతర దేశాల్ని టార్గెట్ చేసిన టెర్రరిస్టులు ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్ తో సహా అనేక ఇస్లామిక్ దేశాల్ని కూడా బాంబులతో దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా శాంతి కరువవుతోంది. స్త్రీలు, పిల్లల మాన, ప్రాణాలకి దారుణమైన ప్రమాదం ముంచుకొస్తోంది... 

ప్రపంచ శాంతి నెలకొనలాంటే ముందుగా జరగాల్సినవి రెండు. యుద్ధం, ఉగ్రవాదం, హింస వంటి అన్నిటికి కారణమైన మతాల్ని, వాటి బోధనల్ని, ఆ బోధనలు ఉపయోగించుకుని యువతని తప్పుదోవ పట్టిస్తున్న వాళ్లని గుర్తించాలి. ఎక్కడ గాయం వుందో అక్కడ మందు పెట్టాలి. అంతే తప్ప సత్యాన్ని గమనించని లౌకికవాద గ్రుడ్డితనం పనికి రాదు. రెండోది అమెరికా లాంటి అగ్ర దేశాలు తమ ఆయుధ వ్యాపారం కోసం రక్తపు క్రీడని ప్రొత్సహించ కూడదు. భూమ్మీద ఉన్మాది, వాడికి ఆయుధాలు అమ్మే వాడు... ఇద్దరు వున్నంత కాలం యుద్ధం, హింస ఎలా ఆగుతాయి? ప్రపంచ శాంతి దినోత్సవాలు జరుపుకోవటం తప్ప....