నూజివీడు-ఖమ్మం మధ్యలో కొత్త అంతర్జాతీయ విమానశ్రయం

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, రాజధానికి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజధాని నిర్మాణం కోసం తగిన స్థలం కనుగొనేందుకు వేయబడిన శివరామ కృష్ణన్ కమిటీతో మొన్న సమావేశమయిన తరువాత, బహుశః వారి సూచనలు, సలహాల ప్రకారమే తన అభిప్రాయం మార్చుకొన్నట్లున్నారు. కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి, ఆ ప్రాంతంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యా వైద్య తదితర సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు తగు చర్యలు, ప్రతిపాదనలు వీలయినంత త్వరలో సిద్దం చేయాలని చంద్రబాబు అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేసారు. ఖమ్మం-కృష్ణా జిల్లాల మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అన్ని రంగాలలో ముఖ్యంగా సాఫ్ట్ వేర్, విద్యా, వైద్య రంగాలలో అభివృద్ధి చెందిన హైదరాబాదుతో చక్కగా అనుసంధానం ఏర్పడి త్వరితగతిన అభివృద్ధి సాధించగలదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.