బీజేపీ దూకుడు.. కాంగ్రెస్ లో వర్గపోరు! వాళ్లు మారరంతే..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత భారీగా పెరిగిందని భావిస్తున్న విపక్షాలు.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంపై పోరాటంలో బీజేపీ దూకుడుగా వెళుతుండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం నేతల మధ్య వర్గపోరుతో వెనకబడినట్లు కనిపిస్తోంది. నేతలు ఉమ్మడిగా కాకుండా ఎవరికి వారే పోరాటాలు చేస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అనుకున్నంత ఉత్సాహం నింపలేకపోతున్నారనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు వస్తున్న మంచి అవకాశాలు నేతల తీరుతో జారిపోతున్నాయని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

కేటీఆర్ ఫాంహౌజ్, పాత సచివాలయం కూల్చివేత, కొత్త సెక్రటేరియేట్ నిర్మాణాలపై ఎంపీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారు. కాని ఈ విషయంలో ఆయనకు పార్టీ నేతల నుంచి సరైన సహకారం అందడం లేదని చెబుతున్నారు. ఎన్జీటీలో కూడా ఆయన పిటిషన్ వేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతి కోసం.. ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఇటీవల కేంద్ర పర్యావరణ బృందం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్లి ఫిర్యాదు చేశారు. మిగితా నేతలెవరు పట్టించుకోలేదు. కేటీఆర్ ఫౌంహౌజ్ విషయాన్ని రేవంత్ వ్యక్తిగత గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఇక శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదం ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాని ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ నేతలెవరు మాట్లాడలేదు. దీంతో సర్కార్ పై ఒత్తిడి పెంచలేకపోయింది కాంగ్రెస్. 

 

వరదలు, పంట నష్టం అంశాల్లోనూ కాంగ్రెస్ నేతలు కలిసి పోరాడలేకపోయారు. వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సరైన పరిహారం అందించలేదు. అయినా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హస్తం నేతలు విఫలమయ్యారనే చర్చ సీనియర్లలో జరుగుతోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రుల సందర్శన యాత్ర చేశారు. అయితే ఆయనకు రేవంత్ రెడ్డి వర్గం సహకరించలేదని తెలుస్తోంది. భట్టి యాత్రలో పార్టీ సీనియర్ నేతలెవరు పాల్గొనలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై అసెంబ్లీలో భట్టి చేసిన సవాల్ ను టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుందనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతోంది. మంత్రి తలసానితో కలిసి భట్టి ఇండ్లను పరిశీలించకుండా.. పార్టీ నేతలతో కలిసి వెళితే ప్రభుత్వం ఇరుకున పడేదని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉచ్చులో భట్టి చిక్కారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే మంచి అవకాశం పోయిందని రేవంత్ టీమ్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారని సమాచారం. 

 

హైదరాబాద్ లో రెండు రోజుల వ్యవధిలోనే వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారు. నాలాలో పడి బాలిక, వరదలో గల్లంతై మరో వ్యక్తి చనిపోయారు. రాజధానిలో ఇంత పెద్ద ఘటనలు జరిగినా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ సరిగా స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ ఎంసీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం గ్రేటర్ సమస్యలపై సర్కార్ ను ప్రశ్నించడంలో ఫేయిల్ అయిందని సిటీ ప్రజల నుంచే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. కాంగ్రెస్ ఈ విషయంలో ఉద్యమించడంలో వెనకబడింది. 

 

మరోవైపు బీజేపీ మాత్రం కేసీఆర్ సర్కార్ పై పోరాటంలో కలిసి వస్తున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతున్న ఎల్ఆర్ఎస్ స్కీంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. lrs జీవోను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించింది, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేశారు కమలం కార్యకర్తలు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో ఇబ్బంది కల్గిన ప్రాంతాల్లోనూ బీజేపీ నేతలు పర్యటించి బాధితులకు బాసటగా నిలిచారు. మొత్తంగా ప్రభుత్వంపై పోరాటంలో ప్రధాన ప్రతిపక్షం వెనకబడుతుండగా.. బీజేపీ మాత్రం దూకుడుగా ఉందనే చర్చ తెలంగాణ ప్రజల్లో జరుగుతోందని రాజకీయ అనలిస్టుల అభిప్రాయం.