చిచ్చురేపుతున్న ఉప ఎన్నిక.. ఉత్తమ్, రేవంత్ ఢీ అంటే ఢీ!!

 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. అసలే ప్రస్తుతం పార్టీ పరిస్థితి అంతంతమాత్రం ఉంది. ఇలాంటి సమయంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేసి ఉప ఎన్నికల పోరులో విజయం సాధించాల్సింది పోయి.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. మొదటినుండి కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు ఎక్కువని అంటుంటారు. అయితే కొన్నేళ్లుగా పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నా.. నేతలు మాత్రం తమ తీరుని మార్చుకొని పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చెయ్యట్లేదు. గ్రూపు రాజకీయాలతో పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. ఇప్పుడు హూజూర్ నగర్ ఉప ఎన్నికతో తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ చిచ్చు మొదలైంది.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హూజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు అక్కడ ఉపఎన్నిక జరగనుంది. అయితే ఉత్తమ్ ఈ ఉప పోరుకు తన భార్య పద్మావతిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. అధిష్టానం అధికారికంగా పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించకున్నా.. పీసీసీ హోదాలో తానే స్వయంగా ప్రకటించుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయానికి తెరలేచింది.

ఉత్తమ్ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తమ్ ఏకపక్షంగా ఎలా అభ్యర్థిని ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం సూచనలు, ఆదేశాలు లేకుండా ఉత్తమ్ ఎలా ప్రకటిస్తారంటూ రేవంత్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించుకున్న ఉత్తమ్ కి షోకాజ్ నోటీసులు జారీ  చేయాలని కూడా రేవంత్ డిమాండ్ చేస్తున్నారట. అంతేకాదు రేవంత్ కూడా ఓ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్నారట. చామల కిరణ్ రెడ్డికి రేవంత్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరనేది? చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

ఈ గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. అసలే పార్టీ అధికారంలో లేదు, గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నాయకులు కలిసి పనిచేయాల్సింది పోయి.. ఇలా తమలో తాము కొట్లాడుకొని అధికార పార్టీకి పరోక్షంగా మేలు చేస్తున్నారంటూ.. కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.